ఎంపీ కడియం కావ్య
* పుస్తకం మనిషికి మంచి నేస్తం
* జ్ఞానాన్ని అందించే గొప్ప సంపద
* ఎంపీ కడియం కావ్య
ఆకేరు న్యూస్, హనుమకొండ, నవంబర్ 7: పుస్తక పఠనంతోనే విజ్ఞానం, ఆలోచనా శక్తి, సృజనాత్మకత పెంపొందుతాయని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. జాతీయ పుస్తక వారోత్సవాలను పురస్కరించుకుని హనుమకొండలోని అశోక కాంప్లెక్స్‌లో నవచేతన బుక్ హౌస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను శనివారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
పుస్తకమే మంచి నేస్తం
ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. పుస్తకం మనిషికి మంచి నేస్తమని, జీవితాంతం జ్ఞానాన్ని అందించే గొప్ప సంపద అని పేర్కొన్నారు. పుస్తక పఠనం వల్ల విజ్ఞానంతో పాటు ఆలోచనా విధానం, సృజనాత్మకత పెరుగుతాయని చెప్పారు. సమాజంపై అవగాహన పెరగడంతో పాటు జీవితాన్ని చూసే దృక్పథంలోనూ మార్పు వస్తుందని వివరించారు.
యువత పఠనంపై దృష్టి పెట్టాలి
ప్రస్తుత డిజిటల్ యుగంలో సెల్ఫోన్లు, సామాజిక మాధ్యమాల వినియోగం పెరుగుతున్నప్పటికీ పుస్తక పఠనానికి ఉన్న ప్రాధాన్యత తగ్గలేదని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత ప్రతిరోజూ కొంత సమయాన్ని పుస్తకాలు చదవడానికి కేటాయించాలని సూచించారు. పుస్తకాలు సమాచారాన్ని అందించడమే కాకుండా నైతిక విలువలు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.
తల్లిదండ్రులు చిన్ననాటి నుంచే పిల్లలకు పుస్తకాలు చదివే అలవాటు నేర్పించాలని కోరారు. పుస్తక ప్రదర్శనలు పాఠకుల్లో పఠనాసక్తిని పెంచడంతో పాటు రచయితలు, సాహితీవేత్తలు, పాఠకులకు మంచి వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు.
పుస్తకాలను కొనుగోలు చేసిన ఎంపీ
పుస్తక పఠన సంస్కృతిని ప్రోత్సహించేందుకు నవచేతన బుక్ హౌస్ నిర్వాహకులు చేపట్టిన కార్యక్రమాన్ని ఎంపీ అభినందించారు. ఇలాంటి ప్రదర్శనలను మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ పుస్తక విభాగాలను సందర్శించి, పలు రకాల పుస్తకాలను ఆసక్తిగా పరిశీలించారు. తనకు నచ్చిన కొన్ని పుస్తకాలను స్వయంగా కొనుగోలు చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, సీనియర్ జర్నలిస్టులు గడ్డం కేశవమూర్తి, గడ్డం రాజిరెడ్డి, వల్లాల వెంకటరమణ, వేణుమాధవ్, తోట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

