Khairatabad Ganesh Shobhayatra
* జనసంద్రంగా హుస్సేన్‌సాగర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : భాద్రపద శుక్ల చతుర్థి నుంచి 12 రోజుల పాటు విశేష పూజలందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవం అత్యంత కోలాహలంగా, వైభవంగా కొనసాగుతోంది. ఈ ఏడాది శ్రీ సప్తముఖ సంకట హర మహాశక్తి గణపతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన మహాగణపతి శోభాయాత్రను చూసేందుకు నగర నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.
* సచివాలయం దాటి క్రేన్ నంబర్ 4 వైపు..
గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది పూజా కార్యక్రమాలు, ట్రాలీపైకి విగ్రహాన్ని చేర్చే ప్రక్రియ వల్ల శోభాయాత్ర కాస్త ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ, అధికారులు మరియు పోలీసులు ప్రత్యేక ప్రణాళికతో నిమజ్జనాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. శోభాయాత్ర రాత్రి 11:30 గంటల సమయానికి కొత్త సచివాలయం ప్రాంగణానికి చేరుకోగా, ప్రస్తుతం ట్యాంక్‌బండ్ వైపు వడివడిగా కదులుతోంది. మరికొద్ది సేపట్లోనే మహాగణపతి క్రేన్ నంబర్ 4 వద్దకు విచ్చేయనున్నారు.
* కోలాటాలు.. శివసత్తుల పూనకాలు
మహాగణపతి శోభాయాత్ర సాగుతున్న మార్గమంతా భక్తుల జయజయధ్వానాలతో హోరెత్తుతోంది. భక్తుల కోలాటాలు, బంజారాల నృత్యాలు, తీన్మార్ డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో ట్యాంక్‌బండ్ మరియు సచివాలయ పరిసర ప్రాంతాలన్నీ పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. గణపతి బప్పా మోరియా.. అగ్లే బరస్ తూ జల్దీ ఆ అనే నామస్మరణలతో నగర వీధులు మార్మోగుతున్నాయి.
* భారీ భద్రత, ట్రాఫిక్ ఆంక్షలు
శోభాయాత్ర సజావుగా సాగేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, విద్యుత్ శాఖ, నగర పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. శోభాయాత్ర మార్గంలో ఎక్కడా విద్యుత్ వైర్లు, చెట్ల కొమ్మలు అడ్డు రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. వేలాది మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేయడమే కాకుండా, సీసీటీవీ కెమెరాల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శోభాయాత్ర ముగిసి నిమజ్జనం పూర్తయ్యే వరకు ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
