Balapur Laddu Auction
* వేలం దక్కించుకున్న సామా ప్రణీత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గణేష్ మహా నిమజ్జనం అంటే రెండు అంశాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. అందులో ఒకటి ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర అయితే మరొకటి బాలాపూర్ లడ్డూ గణపతి లడ్డూ వేలం. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట మరోసారి సరికొత్త చరిత్ర సృష్టించింది.
గత రికార్డులన్నింటినీ తిరగరాస్తూ ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ వేలంలో రూ. 39 లక్షల భారీ ధర పలికింది. తీవ్ర ఉత్కంఠ నడుమ సాగిన ఈ పోటీలో సామా ప్రణీత్ రెడ్డి రికార్డు స్థాయి ధరను దక్కించుకుని బాలాపూర్ గణేశుడి దివ్య ప్రసాదాన్ని దక్కించుకున్నారు.
* 32 ఏళ్ల ఘన చరిత్ర
ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర తర్వాత అంతటి ఆదరణ, విశిష్టత కలిగిన బాలాపూర్ గణపతి లడ్డూ వేలం పాట ఉదయాన్నే ఘనంగా ప్రారంభమైంది. 1994లో కేవలం రూ. 450తో ప్రారంభమైన ఈ వేలం ప్రక్రియ గత 32 ఏళ్లుగా ఏటా నిరంతరాయంగా కొనసాగుతోంది. గణేశుడి ప్రసాదాన్ని దక్కించుకున్న వారికి ఐశ్వర్యం, సమృద్ధి, శుభ ఫలితాలు కలుగుతాయనే గట్టి నమ్మకం ఉండటంతో ఈ లడ్డూ కోసం పోటీపడే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది.
* పోటీపడిన వ్యాపారవేత్తలు, కంపెనీలు
ఈ ఏడాది వేలం పాటలో పాల్గొనేందుకు మొదట్లోనే 9 దరఖాస్తులు రాగా, అందులో 5 ప్రముఖ కంపెనీలు తమ పేర్లను అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం విశేషం. గతేడాది లడ్డూ వేలంలో రూ. 35 లక్షల రికార్డు ధర పలకగా, ఈసారి వేలంలో అంతకు మించి ధర నమోదు కావడం విశేషం. వేలం పాట ప్రారంభమైన కొద్దిసేపటికే దరఖాస్తుదారులు, భక్తులు పోటీపడి పాడటంతో ధర రూ. 39 లక్షలకు చేరి ముగిసింది.
* విజేతకు ఘన సత్కారం
వేలంలో లడ్డూను గెలుచుకున్న సామా ప్రణీత్ రెడ్డిని ఉత్సవ సమితి సభ్యులు, గ్రామస్తులు శాలువాతో ఘనంగా సత్కరించి, ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం బాలాపూర్ లడ్డూ ప్రసాదంతో గణనాథుడి శోభాయాత్ర అత్యంత వైభవంగా హుస్సేన్‌సాగర్ వైపు సాగింది. బాలాపూర్ లడ్డూ సరికొత్త రికార్డు సృష్టించడంతో స్థానికులు, భక్తులు జై గణేష్ నామస్మరణలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
