Waddepally Fire Accident
* రూ.4 కోట్ల ఆస్తి బుగ్గిపాలు
ఆకేరు న్యూస్, హనుమకొండ : వడ్డేపల్లి జవహర్ కాలనీ కూడలిలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సరస్వతి ఎంటర్ప్రైజెస్, శ్రీ సరస్వతి హార్డ్వేర్ అండ్ పెయింట్స్ దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు భారీగా వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది.
అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు పూర్తిగా ఆర్పివేయడంతో స్థానికులు, దుకాణాల యజమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ప్రమాదంలో దుకాణాల్లో ఉన్న హార్డ్వేర్ సామగ్రి, పెయింట్లు, ఇతర వస్తువులు భారీగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో కోట్ల రూపాయల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు రూ.4 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు సంస్థ యజమాని భూక్య భద్రూ నాయక్ తెలిపారు.
అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణమా.. మరేదైనా కారణమా అనే కోణంలో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
