Hanamkonda Zoo Park
* కనువిందు చేసిన సీతాకోకచిలుకలు
ఆకేరు న్యూస్, హనుమకొండ : ప్రకృతిలో ఎంతో అందంగా కనిపించే సీతాకోకచిలుకలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు.. పర్యావరణ సమతుల్యతలో వాటి ప్రాధాన్యతను వివరించేందుకు హనుమకొండలోని కాకతీయ జూలాజికల్ పార్క్‌లో బటర్‌ఫ్లై వాక్ నిర్వహించారు. బిగ్ బటర్‌ఫ్లై మంత్‌లో భాగంగా అటవీ శాఖ, ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు, వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బటర్‌ఫ్లై మంత్ ప్రధాన ఉద్దేశం సీతాకోకచిలుకల ప్రాధాన్యతపై సందర్శకులు, బటర్‌ఫ్లై లవర్స్, పర్యావరణ ప్రేమికులకు అవగాహన కల్పించడమేనన్నారు. బటర్‌ఫ్లై వాక్ వంటి కార్యక్రమాలు ఈ అవగాహన పెంపొందించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.
సీతాకోకచిలుకలు చూడటానికి అందంగా ఉండే చిన్న కీటకాలే అయినప్పటికీ.. పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయని నాగేశ్వరరావు వివరించారు. ఇవి పరాగసంపర్కంలో ముఖ్యమైన పాత్ర పోషించడంతో పాటు.. ఆహార గొలుసులో ఇతర జీవులకు ఆహారంగా కూడా ఉపయోగపడతాయన్నారు.
తద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో సీతాకోకచిలుకలు భాగస్వాములవుతున్నాయని తెలిపారు. అందుకే వీటిని ‘ఫ్లయింగ్ కలర్స్’, ‘ఫ్లయింగ్ జువెల్స్’గా పిలుస్తారని పేర్కొన్నారు.
కాకతీయ జూలాజికల్ పార్క్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బటర్‌ఫ్లై గార్డెన్లో అనేక రకాల సీతాకోకచిలుకలను గుర్తించినట్లు తెలిపారు. వాటి కోసం ప్రత్యేకంగా హోస్ట్ ప్లాంట్స్, నెక్టార్ ప్లాంట్స్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఒక్కో రకమైన సీతాకోకచిలుకకు ప్రత్యేకమైన మొక్కలతో సంబంధం ఉంటుందని, అలాంటి మొక్కల సంరక్షణ ద్వారా వాటి మనుగడకు అనుకూల వాతావరణాన్ని కల్పించవచ్చని చెప్పారు.
బటర్‌ఫ్లై వాక్‌లో ఉదయం నుంచే అనేక రకాల సీతాకోకచిలుకలను గుర్తించినట్లు నిర్వాహకులు తెలిపారు. గుర్తించిన జాతులను డాక్యుమెంట్ చేసి అటవీ శాఖకు అందించడంతో పాటు.. iNaturalist యాప్‌లోనూ నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే నెలలోనూ బటర్‌ఫ్లై సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు.
గతేడాది ములుగు ప్రాంతంలో నిర్వహించిన సర్వేలో సుమారు 100 రకాల సీతాకోకచిలుకలను గుర్తించగలిగామని నాగేశ్వరరావు తెలిపారు. ఈసారి టైగర్ రిజర్వులు, వన్యప్రాణి అభయారణ్యాల్లోనూ బటర్‌ఫ్లై సర్వేలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
కార్యక్రమానికి సహకరించిన తెలంగాణ ప్రభుత్వం, అటవీ శాఖ, ఇతర స్వచ్ఛంద సంస్థలకు ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
* పిల్లలకు ప్రకృతిపై అవగాహన..
కార్యక్రమంలో పాల్గొన్న ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ వాలంటీర్ లలిత మాట్లాడుతూ.. బటర్‌ఫ్లై వాచ్ మంత్‌లో భాగంగా కాకతీయ జూలాజికల్ పార్క్‌లో బటర్‌ఫ్లై వాక్ నిర్వహించామని తెలిపారు. పార్క్‌లో సుమారు 15 రకాల సీతాకోకచిలుకలను గుర్తించినట్లు చెప్పారు.
సొసైటీ సభ్యురాలు శ్రీవిద్య మాట్లాడుతూ.. కాకతీయ జూలాజికల్ పార్క్‌లో అనేక రకాల మొక్కలు, సీతాకోకచిలుకల జాతులు కనిపించడం ఆనందంగా ఉందన్నారు. కుటుంబంతో కలిసి వచ్చి ప్రకృతిని ఆస్వాదించడంతో పాటు పిల్లలు కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం ఉందని చెప్పారు.
సాధారణంగా స్థానిక ప్రాంతాల్లో కనిపించని కొన్ని జాతులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయని తెలిపారు. బటర్‌ఫ్లై మంత్ సందర్భంగా ఆసక్తి ఉన్నవారు పార్క్‌ను సందర్శించి సీతాకోకచిలుకల గురించి తెలుసుకోవాలని సూచించారు.
ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ సభ్యుడు రవిచందర్ మాట్లాడుతూ.. కాకతీయ జూలాజికల్ పార్క్‌లో పచ్చదనం, పుష్పించే మొక్కలు ఎక్కువగా ఉండటంతో వివిధ రకాల సీతాకోకచిలుకలు కనిపిస్తున్నాయని తెలిపారు.
ప్రకృతికి, అడవికి దగ్గరగా ఉండే వాతావరణం ఇక్కడ ఉండటంతో బటర్‌ఫ్లై జాతులకు అనుకూలంగా మారిందన్నారు. ముఖ్యంగా పుష్పించే మొక్కలు సీతాకోకచిలుకలకు ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ప్రకృతి పరిరక్షణలో భాగంగా నిర్వహించిన ఈ బటర్‌ఫ్లై వాక్ ద్వారా సీతాకోకచిలుకల జీవ వైవిధ్యం, పర్యావరణంలో వాటి పాత్రపై సందర్శకులకు అవగాహన కలిగింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
