డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
* ‘శ్రేష్ఠ’ పథకంతో ఉచిత కార్పొరేట్ విద్య!
* నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలి
ఆకేరు న్యూస్, హనుమకొండ: పేదరికం కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘శ్రేష్ఠ’ (SHRESHTA) పథకాన్ని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ సూచించారు. దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉచితంగా నాణ్యమైన విద్యతోపాటు వసతి సౌకర్యం పొందేందుకు ఈ పథకం చక్కటి అవకాశమని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
నవంబర్ 30తో ముగియనున్న గడువు
శ్రేష్ఠ పథకం (SHRESHTA Scheme) కింద 8వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు 9వ తరగతిలో, 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు 11వ తరగతిలో ప్రవేశాలు పొందేందుకు అర్హులని డాక్టర్ రామకృష్ణ వివరించారు. నవంబర్ 14న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నవంబర్ 30తో ముగియనుందని తెలిపారు.
ఆదాయ పరిమితి, ఇతర అర్హత నిబంధనలకు లోబడి విద్యార్థులు జాతీయ పరీక్షల సంస్థ (NTA) అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు, అర్హతలు, ఇతర వివరాలపై సందేహాలుంటే 98494 85100 నంబర్లో సంప్రదించాలని తెలిపారు.
దరఖాస్తు వెబ్సైట్: https://exams.nta.nic.in/shreshta/
తెలంగాణలోనూ అమలు చేయాలి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తరహాలోనే తెలంగాణలోనూ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రముఖ రెసిడెన్షియల్ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించే విధానాన్ని ప్రవేశపెట్టాలని డాక్టర్ రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు సమగ్ర వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్చార్జి బి.ఎం. సందీప్, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ వేం నరేందర్ రెడ్డిల నాయకత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విద్యాభివృద్ధికి మరిన్ని అవకాశాలు కల్పించాలని కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

