Ponguleti Srinivas Reddy
* పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన
ఆకేరు న్యూస్, జనగామ : జనగామ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర గృహ నిర్మాణం, రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. జనగామ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జనగామ మున్సిపాలిటీకి రూ.1.77 కోట్ల విలువైన 16 చెత్త సేకరణ ఆటోలు, ఒక జేసీబీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మున్సిపాలిటీలో పనిచేయనున్న 54 మందికి నియామక పత్రాలను అందజేశారు. వీరిలో 30 మంది శానిటరీ వర్కర్లు, 20 మంది డ్రైవర్లు, నలుగురు ఎలక్ట్రిషియన్లు ఉన్నారు.
* పలు అభివృద్ధి పనులకు శ్రీకారం..
జనగామ మున్సిపల్ డంపింగ్ యార్డులో షెడ్, మెషినరీ పనులకు రూ.2 కోట్లు, మురుగునీటి శుద్ధి ప్లాంట్ (ఎస్టీపీ) నిర్మాణానికి రూ.38 కోట్లతో చేపట్టనున్న పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. తరిగొప్పుల మండలంలో రూ.2.25 కోట్లతో నిర్మించనున్న నూతన తహసీల్దార్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు.
బచ్చన్నపేట మండలం కట్కూర్‌లోని జెడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్ పాఠశాలల్లో రూ.38.75 లక్షలతో చేపట్టనున్న మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు. పోచన్నపేట, రామచంద్రపురం ఎంపీపీఎస్ పాఠశాలలు, జనగామ కోర్టు సమీపంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల (బాలికలు)లో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు.
* పాఠశాలల్లో క్రీడా సదుపాయాలు..
జిల్లాలోని 12 కేజీబీవీలు, 15 పీఎం శ్రీ పాఠశాలలు, 28 జెడ్పీహెచ్ఎస్ (బాలికలు) పాఠశాలల్లో అవుట్డోర్ బాస్కెట్‌బాల్ కోర్టుల నిర్మాణ పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. జనగామ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణం, చంపక్ హిల్స్‌లోని మాతా-శిశు ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్‌కు సీసీ రోడ్డు, పార్కింగ్ ప్రాంత అభివృద్ధి, యూజీడీ పైప్‌లైన్ పనులను చేపట్టనున్నారు.
అదేవిధంగా జనగామ ఐడీఓసీ వద్ద పార్కింగ్ టైల్స్, ఫెన్సింగ్, ప్రహరీ గోడ నిర్మాణ పనులకు సంబంధించిన శిలాఫలకాలను మంత్రి ఆవిష్కరించి పనులకు శంకుస్థాపన చేశారు.
* కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు..
ఈ కార్యక్రమంలో జనగామ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజమహేంద్ర నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి, వైస్ చైర్మన్ భూష పర్వతాలు, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
