Ponguleti Srinivas Reddy
ఆకేరు న్యూస్, హైదరాబాద్: దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ULC చట్టం కింద పాక్షికంగా క్రమబద్ధీకరించిన, క్రమబద్ధీకరించని కాలనీలకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి, అర్హత ఉన్న కేసులను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలని అధికారులను ఆదేశించింది.
ఈ మేరకు Memo.No.48062/ULC/A1/2026-1 జారీ చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గతంలో జారీ చేసిన జీవో నంబర్లు 455, 456, 747, 92 కింద వచ్చిన పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి, అర్హత ఉన్న కేసుల్లో అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు.
* 2016లో జీవో.. అయినా పెండింగ్
ULC సమస్యల పరిష్కారం కోసం 2016లోనే ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ అది పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో అనేక దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి తెలిపారు. దీంతో భూముల హక్కులు, రిజిస్ట్రేషన్లు, ఇతర లావాదేవీల విషయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. తాజా మెమోతో అర్హత కలిగిన ULC కేసులను నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు మార్గం సుగమం కానుందని మంత్రి తెలిపారు.
* 22A సమస్యలపై ఫాస్ట్‌ట్రాక్
భూములకు సంబంధించిన 22A సమస్యల పరిష్కారంపైనా ప్రభుత్వం దృష్టి సారించిందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ నెల 16న శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 22Aతో ముడిపడి ఉన్న కీలక అంశాలను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పటికే 22A సమస్యల పరిష్కారానికి ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు, జీవో 118, జీవో 76కు అనుగుణంగా మెమోలు జారీ చేసినట్లు మంత్రి వివరించారు.
* అనుమతులు ఉన్న భూముల రిజిస్ట్రేషన్లకు మార్గం
22A జాబితాలో ఉన్నప్పటికీ GHMC, HMDA, DTCP, మున్సిపల్ సంస్థల అనుమతులు పొందిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి కల్పిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.
భూములకు సంబంధించిన సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన ప్రజలకు ఇబ్బందులు లేకుండా దశలవారీగా పరిష్కార చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ULC పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి తాజాగా ఇచ్చిన ఆదేశాలు కూడా ఇందులో భాగమేనని వివరించారు.
* అర్హత ఉన్న కేసుల పరిశీలన
ULC, 22Aకు సంబంధించిన సమస్యలను చట్టం, నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించడమే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి తెలిపారు. అర్హత ఉన్న కేసులను అధికారులు త్వరితగతిన పరిశీలించి, అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
