Indiramma Indlu station ghanpur
* ఇల్లు రాలే.. గూడు పోయే!
* ఆవేదనలో వృద్ధ దంపతులు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: ఇందిరమ్మ ఇల్లు మంజూరైందన్న నమ్మకంతో పాత పెంకుటిల్లును కూల్చుకున్న వృద్ధ దంపతులకు చివరకు నిరాశే మిగిలింది. కొత్త ఇంటి నిర్మాణానికి సిద్ధమవుతున్న సమయంలో ఇల్లు మంజూరు కాలేదని అధికారులు చెప్పడంతో ప్రస్తుతం బంధువుల ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డులో తలదాచుకుంటున్నారు. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెంలో చోటుచేసుకుంది.
మంజూరు పత్రం ఇచ్చారని వెల్లడి
ఇప్పగూడెం గ్రామానికి చెందిన కొలిపాక వెంకటయ్య, వెంకటమ్మ దంపతులు కొంతకాలంగా శిథిలావస్థకు చేరిన పెంకుటింట్లో నివసిస్తున్నారు. కొత్త ఇంటి కోసం ఎదురుచూస్తున్న సమయంలో తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్లు పత్రం అందిందని వారు చెబుతున్నారు. జూన్‌లో గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేతుల మీదుగా వెంకటమ్మకు మంజూరు పత్రం అందించినట్లు కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపారు. అనంతరం సర్పంచ్ మందపురం రాణి అనిల్ ఆధ్వర్యంలో భూమిపూజ కూడా నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఇప్పుడు రేకుల షెడ్డే దిక్కు
ఇల్లు వస్తుందన్న నమ్మకంతో వృద్ధ దంపతులు తమ పాత ఇంటిని కూల్చుకున్నారు. అయితే నిర్మాణ పనులు ప్రారంభించే సమయంలో అధికారులు ఇల్లు మంజూరు కాలేదని చెప్పినట్లు వారు తెలిపారు. దీంతో ప్రస్తుతం ఉండేందుకు ఇల్లు లేక బంధువుల ఇంటి ముందు రేకుల షెడ్డులో నివసిస్తున్నారు. వర్షం సమయంలో షెడ్డులోకి నీరు వస్తోందని, చలి సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంజూరు పత్రం అందిన తర్వాతే పాత ఇంటిని కూల్చుకున్నామని, ఇప్పుడు ఇల్లు మంజూరు కాలేదని చెప్పడంతో తమ పరిస్థితి దయనీయంగా మారిందని వాపోతున్నారు.
స్పష్టత ఇవ్వాలని స్థానికుల డిమాండ్
వెంకటమ్మకు మంజూరు పత్రం ఎలా జారీ అయింది? అనంతరం ఇల్లు ఎందుకు మంజూరు కాలేదనే అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. మంజూరు ప్రక్రియలో ఏదైనా పొరపాటు జరిగిందా అనే విషయాన్ని పరిశీలించి, అర్హత ఉంటే వృద్ధ దంపతులకు ఇంటి నిర్మాణానికి అవసరమైన సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం రేకుల షెడ్డులో నివసిస్తున్న వృద్ధ దంపతుల పరిస్థితిపై అధికారులు తక్షణం స్పందించి తాత్కాలికంగా రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
