Konda Surekha
*సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో కీలక వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, వరంగల్ : సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 111 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.61.61 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు అనారోగ్య సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థికంగా అండగా నిలుస్తోందని సురేఖ అన్నారు.
తాను మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల నుంచి ప్రజలు సీఎంఆర్ఎఫ్ సాయం కోసం తనను కలిసేవారని, అర్హులైన వారికి చెక్కులు అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. త్వరలోనే కల్యాణలక్ష్మి చెక్కులు కూడా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.
*ఎంజీఎం ఘటనపై స్పందన..
ఇటీవల ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిన ఘటనపై కొండా సురేఖ స్పందించారు. రాజకీయ లబ్ధి కోసం విపక్షాలు నిరసనలు, ధర్నాలు చేయడం బాధాకరమన్నారు. ఎంజీఎం ఘటన దురదృష్టకరమని, అయితే దేవుడి దయవల్ల ఎవరికీ ప్రమాదం జరగలేదన్నారు. ఆస్పత్రిలో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ భవనాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.
నూతన కలెక్టరేట్ భవనం పనులు కూడా కాంట్రాక్టర్ వైపు నుంచి నిధుల చెల్లింపుల విషయంలో జరుగుతున్న జాప్యం కారణంగా ఆలస్యమవుతున్నాయని, త్వరలోనే ఆ భవనాన్ని కూడా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
* వరంగల్ దేవాలయాల అభివృద్ధిపై బీజేపీకి ప్రశ్నలు
వరంగల్‌లో చారిత్రక, ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయని సురేఖ అన్నారు. కిలా వరంగల్ పరిధిలోని దేవాలయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ అనుమతులు, సహకారం అవసరమని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వరంగల్‌లోని దేవాలయాల అభివృద్ధికి ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు.
ఫోర్ట్ వరంగల్ ప్రాంతంలో 11 దేవాలయాలు వెలుగులోకి వచ్చాయని, కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని వాటిని అభివృద్ధి చేయాలని కోరారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో దాదాపు 99 శాతం దేవాలయాల అభివృద్ధి పనులకు ఇప్పటికే నిధులు కేటాయించినట్లు తెలిపారు.
*మంత్రి పదవి పోయిందని బాధపడటం లేదు
మంత్రి పదవి కోల్పోయిన విషయంపై కూడా కొండా సురేఖ స్పందించారు. పదవి పోయిందని తాను ఏమాత్రం బాధపడటం లేదన్నారు. రాష్ట్రస్థాయి అధికారులతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, వరంగల్ అభివృద్ధికి వారి సహకారం తీసుకుంటామని చెప్పారు.
వారంలో ఒక రోజు డివిజన్లలో పర్యటిస్తూ స్థానిక సమస్యలను నేరుగా తెలుసుకుంటానని తెలిపారు. అవసరమైతే అధికారులను తన వద్దకే పిలిపించి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వారం రోజుల తర్వాత డివిజన్లలోని స్థానిక నాయకులతో సమావేశమై తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
* డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై స్పష్టత
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం సర్వే జరుగుతోందని సురేఖ తెలిపారు. అర్హులైన నిరుపేదలకు మాత్రమే ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. జర్నలిస్టులకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలోనూ అర్హత ఉన్నవారికి న్యాయం జరిగేలా కలెక్టర్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.
తూర్పు నియోజకవర్గంలోని నాయకులు డివిజన్లలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. విపక్షాలకు తమ తప్పులను ఎత్తిచూపే అవకాశం ఇవ్వకుండా ముందుగానే సమస్యలను పరిష్కరించాలని నాయకులకు సూచించారు.
* 24 డివిజన్లపై కొండా సురేఖ ఫోకస్
రాజకీయ ప్రత్యర్థులపై కూడా కొండా సురేఖ ఘాటుగా స్పందించారు. పదవులు కోల్పోయిన కొందరు నాయకులు కత్తులు తిప్పాలని చూస్తున్నారని, అయితే వారి వద్ద కత్తి కూడా లేదంటూ వ్యాఖ్యానించారు. కొండా కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని తమ మహిళా కార్యకర్తలు ఎదుర్కొంటారని అన్నారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 24 మంది కార్పొరేటర్లను గెలిపించుకునేలా పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని కొండా సురేఖ పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
