సైబర్ మోసగాడు (ఏఐ చిత్రం)
* రూ.1.42 కోట్లు స్వాహా
* రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగినికి టోకరా..!
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్లో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగినిని లక్ష్యంగా చేసుకుని ఏకంగా రూ.1.42 కోట్లు కాజేశారు. మనీలాండరింగ్ కేసులో ఇరికిస్తామంటూ బెదిరించి, డిజిటల్ అరెస్ట్ (Digital Arrest Scam) పేరుతో భారీ మొత్తాన్ని తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు.
ముంబై సైబర్ క్రైమ్ పోలీసులమంటూ నేరగాళ్లు బాధితురాలికి వీడియో కాల్స్ చేశారు. మనీలాండరింగ్ కేసులో ఆమె పేరు ఉందని, కేసు నుంచి బయటపడాలంటే తాము చెప్పినట్లు చేయాలని బెదిరించినట్లు సమాచారం. ఈ క్రమంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో ఆమెను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు బదిలీ చేయించుకున్నారు.
* 13 రోజుల్లో రూ.1.42 కోట్ల బదిలీ..
గత నెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు విడతల వారీగా మొత్తం రూ.1,42,01,359ను సైబర్ నేరగాళ్లు బదిలీ చేయించుకున్నట్లు సమాచారం. మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది.
సైబర్ నేరగాళ్లు పోలీసు అధికారులు.. దర్యాప్తు సంస్థల పేర్లతో ఫోన్ లేదా వీడియో కాల్స్ చేసి బెదిరించడం.. డిజిటల్ అరెస్ట్ (Digital Arrest Scam) పేరుతో డబ్బులు వసూలు చేయడం వంటి మోసాలకు పాల్పడుతున్నారు. నిజమైన పోలీసు లేదా ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు వీడియో కాల్లో డిజిటల్ అరెస్ట్ చేసి డబ్బులు బదిలీ చేయాలని కోరవు. ఇలాంటి బెదిరింపులు ఎదురైతే భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

