TRAI 30 Day Recharge
* ఇకపై 30 రోజుల వ్యాలిడిటీ..
* ట్రాయ్ కొత్త రూల్స్
ఆకేరు న్యూస్, డెస్క్: మొబైల్ రీఛార్జ్ వినియోగదారులకు భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) భారీ ఊరటనిచ్చే వార్త అందించింది. ఇప్పటివరకు నెలవారీ రీఛార్జ్ అంటే 28 రోజుల వ్యాలిడిటీ మాత్రమే ఇస్తూ వస్తున్న టెలికాం కంపెనీల దోపిడీకి చెక్ పెడుతూ ట్రాయ్ నూతన నిబంధనావళిని నోటిఫై చేసింది.
* ఏడాదికి 12 రీఛార్జ్లే..
ప్రస్తుతం మొబైల్ వినియోగదారులు ప్రతినెలా రీఛార్జ్ చేసుకుంటే కేవలం 28 రోజుల కాలపరిమితి మాత్రమే లభిస్తోంది. దీనివల్ల ఏడాదికి 12 నెలలే ఉన్నప్పటికీ, వినియోగదారులు 13 సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. ట్రాయ్ కొత్త నిబంధనలతో ఈ పరిస్థితికి తెరపడనుంది. ఇకపై టెలికాం కంపెనీలు కచ్చితంగా 30 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్లను అందుబాటులోకి తేనున్నాయి. అంతేకాకుండా, ప్రతినెలా ఒకే తేదీన (ఉదాహరణకు ప్రతి నెలా 1వ తేదీన) రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది.
* డేటా వాడని వారికి ‘వాయిస్ ఓన్లీ’ ప్లాన్లు..
ఇళ్లు లేదా ఆఫీసుల్లో రోజూ వైఫై (Wi-Fi) వాడేవారికి సిమ్ కార్డ్ డేటాతో పెద్దగా పని ఉండదు. అలాగే కేవలం మాట్లాడటానికి మాత్రమే ఫోన్ ఉపయోగించే సాధారణ వినియోగదారుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కానీ, టెలికాం కంపెనీలు డేటాతో కూడిన బండిల్ ప్లాన్లనే కస్టమర్లపై రుద్దుతుండటంతో, వాడని డేటాకు కూడా ప్రతి నెలా డబ్బులు చెల్లించాల్సి వస్తోంది.
వినియోగదారుల భారాన్ని తగ్గించేందుకు ట్రాయ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. డేటా అవసరం లేని వారి కోసం తక్కువ టారిఫ్తో కూడిన ‘వాయిస్ + ఎస్ఎమ్ఎస్ (Voice + SMS)’ ప్లాన్లను తీసుకురావాలి. కేవలం ఇన్కమింగ్, అవుట్గోయింగ్ కాల్స్ కోసం మాత్రమే ఉపయోగపడే ప్రత్యేక ‘వాయిస్ ఓన్లీ (Voice-only)’ ప్రీపెయిడ్ ప్లాన్లను విరివిగా అందుబాటులోకి తేవాలి.
* పార్లమెంట్ చర్చల తర్వాత నిర్ణయం..
రాజ్యసభ సభ్యులు రాఘవ్ చద్దా మొబైల్ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఈ 28 రోజుల వ్యాలిడిటీ సమస్యను పార్లమెంటులో లేవనెత్తారు. అనంతరం వినియోగదారులు, వివిధ వర్గాలతో సుదీర్ఘ సంప్రదింపులు జరిపిన ట్రాయ్, ఈ ప్రజానుకూల నూతన నిబంధనలను ఖరారు చేసింది.
ట్రాయ్ తీసుకున్న ఈ నిర్ణయంతో కోట్లాది మంది మొబైల్ వినియోగదారులకు ఆర్థికంగా ఉపశమనం లభించడమే కాకుండా, రీఛార్జ్ విషయంలో స్పష్టత రానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
