* మీడియా పాయింట్ వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సబిత
* ఆడబిడ్డలను అవమానించారన్న కేటీఆర్
* రేవంత్ ఎవరినీ ఉద్దేశించి అనలేదన్న మంత్రులు
* రేపు ఆందోళనలకు పిలుపునిచ్చిన బీఆర్ ఎస్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : శాసనసభ (Legislative Assembly) లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Chief Minister Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మహిళలను సీఎం అవమానించారంటూ బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) ఆరోపిస్తున్నారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ (Media point) వద్ద మాజీ మంత్రి సబితారెడ్డి (Former Minister Sabitha Reddy) కన్నీళ్లు పెట్టుకున్నారు. అసలు ఏం జరిగిందంటే.. సీఎ రేవంత్ శాసనసభలో మాట్లాడుతూ.. వెనకాల ఉండే అక్కలు.. ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచి అక్కడ తేలారు. ఆ అక్కల మాటలు వింటే.. జూబ్లీ బస్టాండ్లో కూర్చోవాల్సి వస్తది అని కేటీఆర్ కు సూచించారు. ఈ వ్యాఖ్యలు సబితను ఉద్దేశించే అన్నారని బీఆర్ ఎస్ (BRS) ఆరోపిస్తోంది. దీనిపై సబిత మాట్లాడుతూ.. తాను ఎవరిని ముంచానో రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తానేం చేశానని మొదటి నుంచీ రేవంత్ తన వెంట పడుతున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (MLA Sabitha Indra Reddy) తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. సీఎం ఏ పార్టీలో నుంచి వచ్చారు..? ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి మారారు.? వీటిన్నింటిపై తప్పకుండా చర్చ పెడుతాం. కేసీఆర్ (KCR) ఇంటి మీద వాలిన కాకి నా ఇంటి మీద వాలితే కాల్చేస్తా అని రేవంత్ రెడ్డి అన్నారు. మరి ఎంత మంది ఉన్నారు.. ఎంత మందిని కాల్చేస్తారు. ఎందుకు చేర్చుకున్నారు..? ఇప్పుడేమో సీఎం ఎంజాయ్ చేస్తున్నారు అని సబితా ఇంద్రారెడ్డి నిప్పులు చెరిగారు. అనంతరం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద సబిత మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డికి మహిళలు అంటే గౌరవం లేదని, కేటీఆర్ (KTR) ప్రసంగం నుంచి దృష్టి మళ్లించేందుకు రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు. సభలో తన పేరు ప్రస్తావించి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, సభ నుంచి దొంగల్లా మారిపో్యారని అన్నారు. రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మా ఆడబిడ్డలను అవమానించారు : కేటీఆర్
అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ మా ఆడబిడ్డలను అవమానించారని, ఆయనకు మహిళలంటే గౌరవం లేదని బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మహిళలను నమ్ముకుంటే నట్టేట ముంచుతారని అంటారా అని మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా రేపు ఆందోళనలకు బీఆర్ ఎస్ పిలుపునిచ్చింది. కాగా, సీఎం రేవంత్ రెడ్డి మాటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు (Parliamentary Affairs Minister Sridhar Babu) వంత పాడారు. సభా నాయకుడు సబిత పేరు పెట్టి మాట్లాడలేదని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఎవరి గురించి మాట్లాడలేదు, ఒక సూచన, సలహా ఇచ్చారు అంతే అని శ్రీధర్ బాబు అన్నారు.
————————-