Kaloji University
ST రిజర్వేషన్‌పై కీలక నిర్ణయం
ఆకేరు న్యూస్, వరంగల్ : కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో వైద్య విద్య ప్రవేశాల సందర్భంగా స్థానికత అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో ఎస్టీ రిజర్వేషన్ కింద దరఖాస్తు చేసుకున్న 37 మంది విద్యార్థులు తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్ ప్రయోజనం పొందేందుకు అర్హులు కాదని విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది.
విద్యార్థులు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలపై పరిశీలన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ వెల్లడించింది. అయితే ఈ వ్యవహారాన్ని నకిలీ సర్టిఫికెట్ల అంశంగా భావించవద్దని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు సమర్పించిన సర్టిఫికెట్లు నకిలీవని తేలలేదని, ప్రధానంగా స్థానికత, రాష్ట్రాల మధ్య వలస నిబంధనలకు సంబంధించిన అర్హత విషయంలో సమస్య ఏర్పడిందని యూనివర్సిటీ తెలిపింది.
*గిరిజన సంక్షేమ శాఖ నివేదిక ఆధారంగా నిర్ణయం..
తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ నుంచి అందిన నివేదిక ఆధారంగా 37 మంది విద్యార్థులను తెలంగాణ ఎస్టీ రిజర్వేషన్ పరిధిలోకి తీసుకోలేమని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. తల్లిదండ్రుల మూల రాష్ట్రం, స్థానికతకు సంబంధించిన వివరాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు.
కొంతమంది విద్యార్థులు తెలంగాణలో పుట్టి పెరిగి, ఇక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసినప్పటికీ.. వారి తల్లిదండ్రుల మూలాలు ఇతర రాష్ట్రాల్లో ఉండటంతో రాష్ట్ర ఎస్టీ రిజర్వేషన్ ప్రయోజనానికి వారు అర్హులు కాదని అధికారులు పేర్కొన్నారు.
*9 మంది విద్యార్థుల సీట్లు రద్దు..
37 మంది విద్యార్థుల్లో ఇప్పటికే కౌన్సెలింగ్ తొలి రెండు దశల్లో ఎంబీబీఎస్ సీట్లు పొందిన 9 మంది విద్యార్థులు ఉన్నారు. తాజాగా వారి ప్రవేశాలను రద్దు చేయాలని యూనివర్సిటీ నిర్ణయించింది. ఈ సీట్లను తదుపరి కౌన్సెలింగ్ దశలో భర్తీ చేయనున్నట్లు తెలిపింది. మిగిలిన విద్యార్థులను వారి అర్హత, మెరిట్‌ను బట్టి ఓపెన్ కేటగిరీలో పరిగణించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
*స్థానికతపై గతంలోనే న్యాయస్థానాల స్పష్టత..
వైద్య విద్య ప్రవేశాల్లో స్థానిక కోటా, రిజర్వేషన్‌కు సంబంధించిన నిబంధనలపై గతంలోనే న్యాయస్థానాల్లో వివాదాలు జరిగాయి. తెలంగాణలో స్థానిక కోటా కింద అర్హత పొందేందుకు నిర్దేశించిన విద్యా నిబంధనలను పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసినట్లు నివేదికలు వెల్లడించాయి.
ప్రత్యేకంగా ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వరుసగా తెలంగాణలో చదివిన అంశానికి స్థానికత నిబంధనల్లో ప్రాధాన్యం ఉంది. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేమని సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు సమాచారం.
*నకిలీ సర్టిఫికెట్లు కాదంటున్న వర్సిటీ..
ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత కొందరు విద్యార్థులు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారనే ప్రచారం జరిగింది. అయితే దీనిపై కాళోజీ వర్సిటీ అధికారులు స్పష్టత ఇచ్చారు. సర్టిఫికెట్లు నకిలీవని నిర్ధారణ కాలేదని.. స్థానికతకు సంబంధించిన అర్హతల కారణంగానే ఎస్టీ రిజర్వేషన్ ప్రయోజనం నిరాకరించినట్లు తెలిపారు.
దీంతో వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికత, రిజర్వేషన్ అర్హతలు ఎంత కీలకమో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. ప్రస్తుతం 37 మంది విద్యార్థుల అర్హతను సంబంధిత నిబంధనల ప్రకారం పరిగణిస్తూ, ఇప్పటికే సీట్లు పొందిన వారిలో 9 మంది ప్రవేశాలను రద్దు చేసి తదుపరి కౌన్సెలింగ్‌లో ఆ సీట్లను భర్తీ చేయనున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
