Governor Quota MLC
* నేడు ఆశావహులతో మహేష్‌గౌడ్ భేటీ
ఆకేరు న్యూస్,హైదరాబాద్ : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై కాంగ్రెస్ పార్టీలో కసరత్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తున్న ఆశావహులతో ఆయన భేటీ కానున్నారు.
ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పదవుల కోసం దరఖాస్తు చేసుకున్న ఆశావహులతో మహేష్‌గౌడ్ చర్చించనున్నట్లు సమాచారం. ఆయా నేతల రాజకీయ నేపథ్యం, పార్టీకి చేసిన సేవలు, సామాజిక సమీకరణలు తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తున్న వారిలో గౌరి సతీష్, సత్తు మల్లేష్, అనిల్, చనగాని దయాకర్, బోరెడ్డి అయోధ్యరెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితో సమావేశం అనంతరం పార్టీ అధిష్ఠానానికి అభిప్రాయాలు, ప్రతిపాదిత పేర్లపై సమాచారం అందించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవుల కోసం పలువురు నేతలు తమ ఆసక్తిని వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో పాటు పార్టీకి విధేయత, గతంలో చేసిన సేవలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎవరెవరిని ఎంపిక చేస్తారనే అంశంపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. మహేష్‌గౌడ్ నిర్వహించనున్న సమావేశంలో ఆశావహుల నుంచి అభిప్రాయాలు సేకరించిన అనంతరం తదుపరి ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
