Rayaparthi
* ఆరుతడి పంటలే మేలు!
* నీటి ఎద్దడి ముప్పు పొంచి ఉంది..
ఆకేరు న్యూస్, రాయపర్తి: యాసంగి (Rabi) సీజన్లో రైతులు వరి సాగుకు దూరంగా ఉండి, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేయాలని వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) క్రాంతి కుమార్ సూచించారు. నీటి వనరులు తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుతోనే రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేత్ బచావో అభియాన్’ (Khet Bachao Abhiyan) కార్యక్రమంలో భాగంగా రాయపర్తి మండలంలోని జగన్నాథపల్లె, దుబ్బతండా గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. జగన్నాథపల్లె సర్పంచ్ బద్దం సుగుణమ్మ, దుబ్బతండా సర్పంచ్ దేడావత్ గోపాల్ అధ్యక్షతన, మండల వ్యవసాయ అధికారి (MAO) వీరభద్రం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు జరిగాయి.
ఈ సందర్భంగా ఏఈఓ క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. ఎల్నినో (El Niño) ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయని, ఎండల తీవ్రత కారణంగా భూగర్భ జలాలు తగ్గిపోయి బోర్లు, బావుల్లో నీటి మట్టాలు పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. కనీసం తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి రావచ్చని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఎక్కువ నీరు అవసరమయ్యే వరి, మొక్కజొన్న పంటలకు బదులుగా పప్పుధాన్యాలు, అపరాలు, కూరగాయలు వంటి తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకోవాలని సూచించారు. స్వల్ప కాలంలో చేతికొచ్చే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని తెలిపారు. వ్యవసాయ శాఖ సూచనలను పాటించి పంట నష్టాలను నివారించుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.
అనంతరం సర్పంచులు బద్దం సుగుణమ్మ, దేడావత్ గోపాల్ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు ఇతరుల మాటలు విని మళ్లీ వరి సాగు వైపు మొగ్గు చూపడం బాధాకరమన్నారు. రైతులు ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని వరి సాగు ఆలోచనను విరమించుకోవాలని కోరారు. వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, గ్రామ కార్యదర్శి కార్తీక్, గ్రామ పంచాయతీ అధికారి (GPO) రాధిక, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.

