Osmania University
* అక్టోబరు 9 నుంచి ప్రారంభం
Osmania University| బతుకమ్మ కేవలం ఒక సాంస్కృతిక ఉత్సవం మాత్రమే కాదని, ప్రజా చైతన్యానికి, సామాజిక అవగాహనకు బలమైన వేదిక అని బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ స్పష్టం చేసింది. గత పదిహేనేళ్లుగా ఈ వేదిక ద్వారా సమాజంలోని పలు కీలక అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నేపథ్యంలో వచ్చే అక్టోబర్ 9న చారిత్రక ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా ‘బహుజన బతుకమ్మ’ ఉత్సవాలు ఘనంగా ప్రారంభంకానున్నాయి. ఇక్కడి నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమాలు తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాల పరిధిలోకి విస్తరించనున్నట్లు కమిటీ ప్రకటించింది.
బహుజన బతుకమ్మ పాట ఆవిష్కరణ
ఈ ఉత్సవాల ప్రారంభానికి ముందస్తుగా బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో బహుజన బతుకమ్మ పాట ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రొఫెసర్ కస్తూరి లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ వేదికపై, గ్రామీణ ఉపాధి-స్వయం అభివృద్ధి ప్రధాన ఇతివృత్తంగా కామ్రేడ్ మిత్ర రచించిన ‘‘ఎన్నెల్లో ఎన్నెల్లో ఎన్నెలాలో’’ పాటను ప్రొఫెసర్ మనోజ ఆవిష్కరించారు. అరుణోదయ విమలక్క తన బృందంతో కలిసి ఈ పాటను ఆలపించగా, ప్రొఫెసర్ కొల్లాపురం విమల దాని నేపథ్యాన్ని, సందేశాన్ని వివరించారు.
విస్తృతంగా ప్రజల్లోకి..
గ్రామీణ నిరుద్యోగం, వ్యవసాయ రంగ సంక్షోభం, పెరుగుతున్న జీవన వ్యయాలు, పర్యావరణ మార్పులు వంటి సమకాలీన సమస్యలపై ప్రజల్లో చైతన్యం పెంపొందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని వక్తలు పేర్కొన్నారు. ప్రజా సమస్యలు, సామాజిక హక్కులు, సాంస్కృతిక చైతన్యాన్ని పాటలు, కళారూపాల ద్వారా విస్తృతంగా ప్రజానీకంలోకి తీసుకెళ్లేందుకు ఈ ఉత్సవాలు ఎంతగానో దోహదపడతాయని వారు అభిప్రాయపడ్డారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
