Telangana Bars Bandh
* లైసెన్స్ ఫీజుల పెంపునకు నిరసన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం లైసెన్స్ ఫీజులను భారీగా పెంచడంతో పాటు కొత్తగా ప్రివిలేజ్ సెస్ విధించడాన్ని నిరసిస్తూ తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ సోమవారం రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది.
హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని దాదాపు 1,200 బార్ అండ్ రెస్టారెంట్లు మూతపడ్డాయి. బార్ల మూసివేతతో తమ వ్యాపారాలు పూర్తిగా స్థంభించిపోవడమే కాకుండా, వీటిపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికుల కుటుంబాలు, వారి ఉపాధి ప్రమాదంలో పడ్డాయని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కో బార్‌పై ఏటా రూ. 30 లక్షలు..
గతంలో రూ. 40 లక్షలుగా ఉన్న వార్షిక లైసెన్స్ ఫీజును ప్రభుత్వం ఏకంగా రూ. 44 లక్షలకు పెంచిందని అసోసియేషన్ నాయకులు వాపోతున్నారు. దీనికి తోడు స్లాబ్‌ల ఆధారంగా 8 శాతం నుంచి 20 శాతం వరకు అదనంగా విధించిన ప్రివిలేజ్ సెస్ నిర్ణయంతో ఒక్కో బార్‌పై ఏడాదికి రూ. 30 లక్షల వరకు మోయలేని భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు మద్యం షాపుల వద్ద పర్మిట్ రూమ్‌లు, బెల్ట్ షాపుల నిర్వహణ వల్ల ఇప్పటికే బార్ల వ్యాపారం తీవ్రంగా దెబ్బతిన్న తరుణంలో ఈ కొత్త పన్నులు విధించడం దారుణమని ధ్వజమెత్తారు.
ఎక్సైజ్ భవన్ ముట్టడి
తమ సమస్యలపై ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి వినతిపత్రం అందించినప్పటికీ ఆశించిన స్పందన రాలేదని నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఈ పెంపును పునరాలోచించి, ప్రివిలేజ్ సెస్ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
లేకుంటే నాంపల్లిలోని ఎక్సైజ్ కమిషనరేట్ ముట్టడికి పిలుపునిస్తామన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని, అవసరమైతే నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
