BV Raghavulu
* ప్రజాస్వామ్య పరిరక్షణలో యువత పాత్ర కీలకం
* నిరసనకారుల అరెస్టులపై బీవీ రాఘవులు ఆగ్రహం..
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ : ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వేలాది మంది యువత, విద్యార్థులు చేపట్టిన ఆందోళన విజయవంతమైంది.
ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును పరిరక్షించేందుకు నడుం బిగించిన యువతకు సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు దేశ ప్రజల తరఫున ఘన అభినందనలు తెలిపారు. ఈ పోరాటానికి సిపిఐ(ఎం) తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
బి.వి. రాఘవులు ప్రెస్ నోట్ ద్వారా మాట్లాడుతూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. బీజేపీ ఆదేశాల మేరకు కోట్లాది మంది ఓటర్లను జాబితాల నుంచి తొలగించే దురుద్దేశంతోనే ఈసీఐ ‘ఎస్ఐఆర్’ (SIR) ప్రక్రియను చేపట్టిందని ఆయన తీవ్రంగా విమర్శించారు.
పోలీసుల నిర్బంధాన్ని ఛేదించి..
ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించి, తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ, బారికేడ్లను సైతం లెక్కచేయకుండా వేలాది మంది యువత నిరసన ప్రదేశానికి చేరుకోవడం వారి స్పూర్తికి నిదర్శనమన్నారు.
* అణచివేత ఖండనీయం..
నిరసన తెలుపుతున్న వందలాది మంది యువకులు, విద్యార్థులను, ముఖ్యంగా మహిళా విద్యార్థినులను పోలీసులు అరెస్టు చేసి, బలవంతంగా ఈడ్చుకెళ్లి దురుసుగా ప్రవర్తించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పోలీసుల ఈ చర్యల్లో పలువురు యువత గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
* భవిష్యత్ తరాలకు బాధ్యత..
దేశాన్ని గుప్పిట్లోకి తీసుకునేందుకు బీజేపీ-ఆర్ఎస్ఎస్ కూటమి ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందని హెచ్చరించారు. పూర్వ తరాలు సుస్థిరం చేసిన ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యతను నేటి యువత భుజానకెత్తుకోవాలని పిలుపునిచ్చారు.
* కొనసాగనున్న పోరాటం..
ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేసేంతవరకు, బీజేపీ-ఆర్ఎస్ఎస్ కూటమి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ఓడించే లక్ష్యంతో దేశ యువత, విద్యార్థులు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యువత సాగిస్తున్న ఈ చారిత్రాత్మక పోరాటానికి సిపిఐ(ఎం) ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

