Naini Vishal Foundation| ఆకేరు న్యూస్, హనుమకొండ: యువతలో ఆరోగ్య స్పృహ, శారీరక దారుఢ్యంపై అవగాహన కల్పించే లక్ష్యంతో హనుమకొండలో నిర్వహించిన ‘ట్రై సిటీస్ హాఫ్ మారథాన్’ ఉత్సాహభరితంగా సాగింది. నాయిని విశాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి, డాక్టర్ గోదా సంయుక్త నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి యువత, క్రీడాకారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
జెండా ఊపి ప్రారంభించిన మంత్రి
ఈ మారథాన్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నీలిమా రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు. మంత్రి శ్రీధర్ బాబు సైతం కొంత దూరం పరుగెత్తి యువతలో ఉత్సాహాన్ని నింపారు.
ఆరోగ్యంపై అవగాహన అవసరం
ఈ సందర్భంగా రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మాట్లాడుతూ.. నేటి యువతలో ఆరోగ్యం, ఫిట్నెస్పై అవగాహన పెంచేందుకు ఇలాంటి మారథాన్లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.
చదువులు, ఉద్యోగాల కారణంగా చాలామంది యువత శారీరక శ్రమకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. రోజువారీ జీవితంలో నడక, పరుగు, యోగా వంటి వ్యాయామాలను భాగం చేసుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ఆరోగ్యకరమైన శరీరంతో పాటు ప్రశాంతమైన మనస్సును అందిస్తుందని తెలిపారు. క్రీడలు యువతలో నాయకత్వ లక్షణాలు, మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
యువతతో సందడిగా మారథాన్
వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి అథ్లెట్లు, వివిధ కళాశాలల విద్యార్థులు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం మారథాన్లో భాగస్వాములయ్యారు. రోడ్ల వెంట నిలిచిన ప్రజలు క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ అభినందించారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కార్యక్రమం సందడిగా సాగింది.
వైద్య నిపుణుల సూచనలు
మారథాన్లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్స్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ వోడితల రామ, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ క్రాంతి కుమార్ తదితర వైద్య నిపుణులు పాల్గొన్నారు. క్రీడాకారులకు ఫిజియోథెరపీకి సంబంధించిన సూచనలు, వ్యాయామ మెలకువలను వివరించారు.
భవిష్యత్తులోనూ ఇలాంటి ఆరోగ్యకరమైన కార్యక్రమాలను నిర్వహించి యువతను క్రీడల వైపు మరింతగా ప్రోత్సహిస్తామని నిర్వాహకులు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

