MLA Naini Rajender Reddy
*నీరు, కరెంట్ పొదుపు చేయండి : ఎమ్మెల్యే నాయిని
ఆకేరు న్యూస్, హన్మకొండ : ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు, ‘ఎల్‌నినో’ (El Nino) ప్రభావం కారణంగా భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడి, విద్యుత్ కొరత ఏర్పడే పరిస్థితులు నెలకొంటున్నాయని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) తెలిపారు.
ఈ అంతర్జాతీయ వాతావరణ సవాళ్ల నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలందరూ ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని, నీరు మరియు విద్యుత్‌ను ఎంతో పొదుపుగా, అవసరమైన మేరకే వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఎల్‌నినో ప్రభావం అనేది కేవలం మన రాష్ట్రానికో లేక ఒక దేశానికో పరిమితం కాదని, ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే సహజ పర్యావరణ పరిణామమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎల్‌నినో కారణంగా వర్షపాతం తగ్గి ఆనకట్టలు, జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల ఇటు తాగునీటి సరఫరాతో పాటు అటు విద్యుత్ ఉత్పత్తిపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విద్యుత్ ఇబ్బందులు కలగకుండా సరఫరాను మెరుగుపరిచేందుకు అవసరమైన నిధులను కేటాయిస్తూ ముందస్తు చర్యలు చేపడుతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా నెలకొనే వాతావరణ అత్యవసర పరిస్థితుల ప్రభావం నాణ్యమైన కరెంట్ సరఫరాపై పడే అవకాశం ఉందన్నారు.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజల సహకారం అత్యంత అవసరమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా చేయకుండా వినియోగించుకోవాలని, అవసరం లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్లు, లైట్లు, ఇతర విద్యుత్ పరికరాలను వెంటనే ఆపివేయాలని కోరారు.
ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన అవసరమని, నీరు మరియు విద్యుత్ పొదుపును ఒక సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) పిలుపునిచ్చారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

