Ramayana Movie Cast
* నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల
Ramayana| ఆకేరు న్యూస్, సినిమా: భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ప్రేక్షకులకు మరపురాని బిగ్ స్క్రీన్ అనుభూతిని అందిస్తుందని బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన తెలుగు ప్రీ-రిలీజ్ వేడుకలో చిత్ర బృందం పాల్గొని సినిమా విశేషాలను వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రముఖ నటీనటులు, దర్శకుడు, నిర్మాతలు చిత్రంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖ పాత్రలో నటిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2026 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఎస్వీసీ సంస్థ విడుదల చేయనుంది.
ప్రేక్షకులకు గొప్ప అనుభూతి: రణ్‌బీర్
హైదరాబాద్ వేడుకలో రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ.. కొన్ని కథలు తరతరాలుగా ప్రజల జీవితాల్లో భాగంగా ఉంటాయని, రామాయణం అలాంటి గొప్ప ఇతిహాసమని పేర్కొన్నారు. తండ్రిగా, కొడుకుగా, భర్తగా, స్నేహితుడిగా ఎలా ఉండాలో ఈ కథ ఎన్నో విషయాలను నేర్పిస్తుందని అన్నారు. ప్రేక్షకులు ఈ సినిమాను చూసినప్పుడు కేవలం ఒక చిత్రాన్ని వీక్షించిన అనుభూతి కాకుండా, గొప్ప అనుభవాన్ని పొందుతారని తెలిపారు.
దర్శకుడు నితేష్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ ప్రాజెక్టును అద్భుతమైన విజన్‌తో రూపొందిస్తున్నారని ప్రశంసించారు. సాయి పల్లవితో కలిసి పనిచేయడం తనకు ప్రత్యేకమైన అనుభవమని, ఆమెను షూటింగ్లో చూసినప్పుడు సీతమ్మవారిని చూసిన భావన కలిగిందని చెప్పారు. యశ్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని కొనియాడారు. తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రపంచ స్థాయికి భారతీయ సినిమా: యశ్
రాకింగ్ స్టార్ యశ్ మాట్లాడుతూ.. ఒక మంచి సినిమాను నిర్మించాలంటే నిర్మాతకు ప్యాషన్, అంకితభావం ఎంతో అవసరమని అన్నారు. ఈ చిత్ర నిర్మాణంలో నమిత్ మల్హోత్రా చూపిస్తున్న విజన్ ప్రశంసనీయమని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా విడుదల కోసం దిల్ రాజు తీసుకుంటున్న శ్రద్ధను అభినందించారు.
దర్శకుడు నితేష్ తివారీతో కలిసి పనిచేయడం మంచి అనుభవమని యశ్ తెలిపారు. రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతారని అన్నారు. భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలన్న నమిత్ మల్హోత్రా ప్రయత్నం అభినందనీయమని పేర్కొంటూ, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రేమను పొందాలని ఆకాంక్షించారు.
సీత పాత్రపై సాయి పల్లవి
సాయి పల్లవి మాట్లాడుతూ.. రామాయణం తన బాల్యం నుంచి పరిచయమున్న కథ అని, ఇలాంటి ప్రతిష్ఠాత్మక చిత్రంలో భాగం కావడం ఆనందంగా ఉందని తెలిపారు. దర్శకుడు నితేష్ తివారీ ప్రతి పాత్రను ఎంతో శ్రద్ధతో తీర్చిదిద్దారని, నిర్మాత నమిత్ మల్హోత్రా ఆలోచనా విధానం ప్రత్యేకమైనదని చెప్పారు.
ఈ చిత్రంలో అత్యుత్తమ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ కథతో అనుసంధానమవుతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సీత పాత్రను చూసినప్పుడు ప్రేక్షకులకు దివ్యమైన భావన కలగాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న అభిమానానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు.
తెలుగు సినిమాలపై నితేష్ తివారీ ప్రశంసలు
దర్శకుడు నితేష్ తివారీ తెలుగు సినిమాలపై తనకున్న అభిమానాన్ని ఈ వేడుకలో వెల్లడించారు. నాగార్జున నటించిన ‘శివ’, ‘గీతాంజలి’, ‘క్షణక్షణం’తో పాటు ‘ఈగ’, ‘మగధీర’, ‘బాహుబలి’ వంటి చిత్రాలు తనపై ప్రభావం చూపాయని తెలిపారు. తెలుగు, హిందీ భాషల ప్రేక్షకులు ‘రామాయణం’ను సమానంగా ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
రవి దూబే మాట్లాడుతూ.. రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్రలో అద్భుతంగా నటించారని, సాయి పల్లవి సీత పాత్రకు న్యాయం చేశారని ప్రశంసించారు. ఈ ఇతిహాస కథ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరాలని ఆకాంక్షించారు.
నటి రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులను మళ్లీ కలవడం సంతోషంగా ఉందన్నారు. తన సినీ ప్రయాణం తెలుగులోనే ప్రారంభమైందని గుర్తుచేసుకున్నారు. ‘రామాయణం’ వంటి ప్రతిష్ఠాత్మక చిత్రంలో భాగం కావడం గర్వంగా ఉందని, శూర్పణఖ పాత్ర ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నవంబర్ 5న థియేటర్లలోకి..
నిర్మాత నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. ‘రామాయణం’ కేవలం సినిమా మాత్రమే కాదని, తరతరాలుగా భారతీయుల జీవితాల్లో భాగమైన గొప్ప ఇతిహాసమని పేర్కొన్నారు. భారతీయ కథను ప్రపంచ ప్రేక్షకులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల పంపిణీదారుడు దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం చూపించిన 3డీ విజువల్స్ తనను ఆకట్టుకున్నాయని చెప్పారు. థియేటర్లలో ప్రేక్షకులు అద్భుతమైన అనుభూతిని పొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాత కరణ్ జోహార్ సైతం ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగం కావడం ఆనందంగా ఉందని తెలిపారు.
భారీ నిర్మాణ విలువలు, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, ప్రముఖ నటీనటుల కలయికతో రూపొందుతున్న ‘రామాయణం’పై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం తొలి భాగం 2026 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

