Chandrababu
* పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
* బాధితులకు న్యాయం చేయాలి
* ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
Chandrababu| ఆకేరు న్యూస్, మంగళగిరి: రాష్ట్ర అభివృద్ధికి శాంతిభద్రతలే మూలస్తంభాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శాంతిభద్రతలు, అభివృద్ధి, ఉపాధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా మంగళగిరిలోని పోలీసు బెటాలియన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాతృభూమి, ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఖాకీ అంటే బాధ్యతకు, పోలీస్ అంటే భరోసాకు ప్రతీక అని కొనియాడారు. పండుగలు, ఉత్సవాల సమయంలోనూ కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని ప్రశంసించారు. అమరులైన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
పెట్టుబడులకు భద్రతే కీలకం
రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయని, పారిశ్రామిక అభివృద్ధి సాధ్యమవుతుందని చంద్రబాబు తెలిపారు. అశాంతి నెలకొన్న ప్రాంతాల్లో పెట్టుబడిదారులు ముందుకు రావడానికి ఆసక్తి చూపరని పేర్కొన్నారు. దేశ రక్షణకు ముప్పు కలిగించే కుట్రలను ఛేదించిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాన్ని అభినందించారు. రాష్ట్రంలో ఫ్యాక్షన్, తీవ్రవాదం, మత కలహాలను అణచివేయడంలో పోలీసుల పనితీరు ప్రశంసనీయమని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని స్పష్టం చేశారు.
బాధితులకు అండగా ఉండాలి
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడికి మానవత్వంతో కూడిన న్యాయం అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. పోలీసుల యూనిఫాం చూస్తే బాధితులకు భరోసా కలగాలని, నేరస్థుల్లో భయం ఉండాలని అన్నారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించకూడదని పోలీసులకు సూచించారు. నేరం జరిగిన తర్వాత దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోవడం ఎంత ముఖ్యమో, నేరాలు జరగకుండా ముందుగానే నివారించడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు.
ఏఐతో దర్యాప్తు వేగవంతం
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని చంద్రబాబు సూచించారు. ఒక్క ఫోన్ కాల్ లేదా లింక్ ద్వారా జరిగే సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని అన్నారు. సీసీ కెమెరాలు, డేటా విశ్లేషణ, డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి ఆధునిక సాంకేతికతను దర్యాప్తులో విస్తృతంగా ఉపయోగించాలని పిలుపునిచ్చారు. టెక్నాలజీ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.
మహిళల భద్రతకు ప్రాధాన్యం
‘వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్’ లక్ష్య సాధనలో పోలీసుల పాత్ర కీలకమని సీఎం పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈగల్ బృందం మరింత సమర్థంగా పనిచేయాలని సూచించారు. మహిళలపై నేరాలకు పాల్పడాలంటేనే భయపడేలా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపైనా ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు అధికారులకు సూచించారు.
పోలీసుల ఆరోగ్యమూ ముఖ్యం
విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న పోలీసులు యోగా, ధ్యానం ద్వారా మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. ప్రజల భద్రతకు నిరంతరం కృషి చేస్తున్న పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలపడమే పోలీసు అమరవీరులకు అర్పించే నిజమైన నివాళి అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

