ramanuja pre release event
* అక్టోబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల
ఆకేరు న్యూస్, సినిమా: సమానత్వ సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన రామానుజాచార్యుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘జయహో రామానుజ’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. లయన్ డా. సాయి వెంకట్ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
సమానత్వమే ప్రధాన సందేశం
సుదర్శనం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుదర్శనం సాయి ప్రసన్న, సుదర్శనం ప్రవళ్లిక ఈ చిత్రాన్ని నిర్మించారు. అమెరికా నటి జో శర్మ కథానాయికగా నటించగా, సుమన్, ప్రవళ్లిక తదితరులు కీలక పాత్రలు పోషించారు. రామానుజాచార్యులు సమాజంలో సమానత్వం కోసం చేసిన కృషి, ఆయన జీవితంలో ఎదురైన సవాళ్లను ఈ సినిమాలో చూపించనున్నారు.
నటి, నిర్మాత ప్రవళ్లిక మాట్లాడుతూ.. ‘జయహో రామానుజ’ చిత్రాన్ని రూపొందించడం ఒక సవాలైతే, ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మరో సవాలని అన్నారు. సినిమాకు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నామని, అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వద్ద కూడా ప్రమోషన్లు చేపట్టినట్లు తెలిపారు. ఈ చిత్రంలో కృష్ణుడు, నారదుడు, రఘునాథస్వామి వంటి మూడు పాత్రల్లో నటించే అవకాశం రావడం తన అదృష్టమని పేర్కొన్నారు. రామానుజాచార్యుల జీవిత విశేషాలు నేటి తరానికి చేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రముఖుల ప్రశంసలు
నిర్మాత నాగబాల సురేష్ మాట్లాడుతూ.. పౌరాణిక నేపథ్య చిత్రాల నిర్మాణం సవాలుతో కూడుకున్నదని అన్నారు. రామానుజాచార్యుల జీవితాన్ని వెండితెరపైకి తీసుకొస్తున్న లయన్ సాయి వెంకట్ ప్రయత్నాన్ని అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో చారిత్రక అంశాలతో పాటు సమాజానికి ఉపయోగపడే సందేశం కూడా ఉందని పేర్కొన్నారు.
దర్శకుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. రామానుజాచార్యుల జీవితాన్ని సినిమాగా తెరకెక్కించడం అభినందనీయమని అన్నారు. సమాజానికి మంచి సందేశాన్ని అందించే చిత్రాలు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా మానవులంతా సమానమనే భావనను రామానుజాచార్యులు చాటిచెప్పారని గుర్తుచేశారు. మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలాచారి కూడా చిత్ర బృందాన్ని అభినందించారు. రామానుజాచార్యుల తత్వాన్ని యువతకు పరిచయం చేయడంలో ఈ సినిమా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నా అదృష్టం: సాయి వెంకట్
చిత్ర కథానాయకుడు, దర్శకుడు లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ.. చిన్నతనంలో రామానుజాచార్యుల కథలు చదివినప్పటి నుంచే ఆయన జీవితాన్ని సినిమాగా రూపొందించాలనే ఆలోచన కలిగిందని చెప్పారు. తొలుత ఆయన కథలపై పత్రికలకు రచనలు పంపించానని, ఆ ఆలోచన కాలక్రమంలో సినిమా రూపం దాల్చిందని వివరించారు.
కులమతాలకు అతీతంగా మానవులంతా ఒక్కటేననే గొప్ప సందేశాన్ని రామానుజాచార్యులు అందించారని పేర్కొన్నారు. చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులను తన కుమార్తె ప్రవళ్లిక నాణ్యతతో పూర్తి చేయించారని తెలిపారు. ప్రేక్షకులు సినిమాను ఆదరించి, రామానుజాచార్యుల జీవితం, సిద్ధాంతాల గురించి తెలుసుకోవాలని కోరారు.
అక్టోబర్ 24న విడుదల
సుదర్శనం హేమలత సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను లయన్ సాయి వెంకట్ నిర్వహించారు. నిర్మాతలు వేదాల శ్రీనివాస్, అంకమ్మ చౌదరి, వ్యాపారవేత్త అశ్వాపురం వేణుమాధవ్, పీసీసీ జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ మూర్తి తదితరులు ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు. రామానుజాచార్యుల జీవితం, ఆయన సమానత్వ సిద్ధాంతాలను ప్రధానంగా ఆవిష్కరించనున్న ‘జయహో రామానుజ’ చిత్రం అక్టోబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

