Revanth Reddy
* కులగణన ఆధారంగా నిర్ణయం
* సామాజిక న్యాయమే ప్రభుత్వ లక్ష్యం
* సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బీసీ-ఏ గ్రూపులో చేర్చే అంశంపై సమగ్రంగా అధ్యయనం చేసి తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. బహుజన హక్కుల కోసం పోరాడిన పండుగ సాయన్న, దొడ్డి కొమురయ్య విగ్రహాలను ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రభుత్వం నిర్వహించిన పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. సాయన్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనపై రూపొందించిన పాటలను ఆవిష్కరించారు.
బీసీ-ఏపై అధ్యయనం
ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి మరో గ్రూపులోకి మార్చే అంశంపై గతంలో తగిన గణాంకాలు లేకపోవడంతో న్యాయపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయని సీఎం గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహించిన కులగణన వివరాల ఆధారంగా ఈ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. న్యాయనిపుణులు, అధికారులతో చర్చించిన తర్వాత మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటామని వివరించారు.
ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చితే గంగపుత్రులకు అన్యాయం జరుగుతుందనే ఆందోళనల నేపథ్యంలో సంబంధిత వర్గాలతో చర్చించి అపోహలను తొలగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సూచించారు.
కులగణనతో హక్కులు
కులగణన బలహీనవర్గాలకు తమ హక్కుల కోసం గొంతెత్తే ధైర్యాన్ని ఇచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. 2024 ఫిబ్రవరి 4న కమిషన్‌ను ఏర్పాటు చేసి, 2025 ఫిబ్రవరి 4 నాటికి కులగణన ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు. గణాంకాల్లో తప్పులు ఉన్నా, వివరాలు నమోదు కాకపోయినా సరిచేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
కచ్చితమైన గణాంకాల ఆధారంగా విద్య, ఉద్యోగాలు, ఉపాధి రంగాల్లో సామాజిక న్యాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
సాయన్న పోరాటం స్ఫూర్తి
నిరుపేదలు, బహుజనుల హక్కుల కోసం పండుగ సాయన్న తన జీవితాన్ని అంకితం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. భూముల రక్షణ కోసం జమీందార్లు, జాగీర్దార్లు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు. ఆయన చరిత్రకు తగిన గుర్తింపు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
సర్వాయి పాపన్న గౌడ్, జ్యోతీరావు పూలే వంటి మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసిన తరహాలోనే పండుగ సాయన్న, దొడ్డి కొమురయ్య విగ్రహాలను కూడా ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
సంక్షేమ పథకాలు కొనసాగింపు
గత ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలను రద్దు చేయకుండా మరింత మెరుగుపరిచి అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో 3.48 కోట్ల మందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తున్నట్లు చెప్పారు. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే సుమారు 55 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు వివరించారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, రైతు భరోసా సాయాన్ని రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచామని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.14 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిందని పేర్కొన్నారు.
25 లక్షలకు పైగా రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, నిరుపేదల కోసం ఎనిమిది లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని వెల్లడించారు. షాదీముబారక్, కళ్యాణలక్ష్మి పథకాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
పోరాటయోధులకు గుర్తింపు
సర్వాయి పాపన్న గౌడ్, దొడ్డి కొమురయ్య, కొండా లక్ష్మణ్ బాపూజీ, జ్యోతీరావు పూలే, చాకలి ఐలమ్మ వంటి మహనీయులు బహుజనుల హక్కుల కోసం పోరాడారని సీఎం గుర్తుచేశారు. సమాజం కోసం జీవితాలను అంకితం చేసిన వారి చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, ఈటల రాజేందర్, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

