కొండ మార్గంలో నడుస్తున్న నవవధువు
* రోడ్డు కోసం సీఎం ధామీకి నవవధువు విజ్ఞప్తి
Uttarakhand| ఆకేరు న్యూస్, డెస్క్: కొండ ప్రాంతంలో రహదారి సౌకర్యం లేకపోవడంతో ఓ నవవధువు పెళ్లి దుస్తుల్లోనే సుమారు 18 కిలోమీటర్లు నడిచి అత్తారింటికి చేరుకుంది. ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తమ గ్రామానికి రహదారి నిర్మించాలని ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి విజ్ఞప్తి చేసింది.
పెళ్లి దుస్తుల్లోనే కొండబాట
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ సమీపంలోని చక్రాటా బ్లాక్ పరిధిలో ఉన్న లోఖండి ప్రాంతానికి చెందిన బులహర్ గ్రామ యువతి షర్మిలకు ఉండవా గ్రామానికి చెందిన అనిల్ చౌహాన్‌తో వివాహం జరిగింది. పెళ్లి అనంతరం బారాత్‌తో కలిసి ఆమె అత్తవారింటికి బయలుదేరింది. లోఖండి ప్రాంతం వరకు వాహనాల్లో ప్రయాణం సాఫీగానే సాగింది. అయితే, అక్కడి నుంచి ఉండవా గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
దీంతో పెళ్లి లేహంగా, భారీ ఆభరణాలు ధరించిన షర్మిల రాళ్లు, రప్పలతో కూడిన కొండ మార్గంలో నడవాల్సి వచ్చింది. గృహప్రవేశానికి నిర్ణయించిన శుభ ముహూర్తానికి చేరుకోవాలనే ఉద్దేశంతో సుమారు 18 కిలోమీటర్ల దూరాన్ని నాలుగు గంటల పాటు నడిచి ప్రయాణించినట్లు సమాచారం.
సీఎం ధామీకి విజ్ఞప్తి
షర్మిల కొండ మార్గంలో నడుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా ఆమె తమ గ్రామానికి పక్కా రహదారి సౌకర్యం కల్పించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీని కోరినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.
రహదారి లేకపోవడంతో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ ఘటన మరోసారి వెలుగులోకి తెచ్చింది. ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారిని ఆసుపత్రులకు తరలించడంతో పాటు నిత్యావసర వస్తువుల రవాణాకు కూడా రహదారులు కీలకంగా ఉంటాయి
View this post on Instagram

Please tell us what is wrong. Your report will be sent to the website team.

