కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం
* పోలీసింగ్‌లో ప్రజలకు నాణ్యమైన సేవలే లక్ష్యం
Huzurabad| ఆకేరు న్యూస్, హుజూరాబాద్: కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం శనివారం హుజూరాబాద్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని వివిధ విభాగాలు, రికార్డులను పరిశీలించి పోలీసుల విధులు, క్షేత్రస్థాయి పనితీరుపై సమీక్షించారు.
పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న సీపీకి హుజూరాబాద్ ఏసీపీ మాధవి, ఇన్స్పెక్టర్ కరుణాకర్ స్వాగతం పలికారు. అనంతరం సీపీ సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్టేషన్‌లోని పలు విభాగాలను పరిశీలించి, కేసుల నిర్వహణ, రికార్డుల క్రమబద్ధీకరణ, సిబ్బంది పనితీరుపై అధికారులతో చర్చించారు.
సీసీ కెమెరాలపై ప్రత్యేక దృష్టి
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని సీపీ పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని నిఘా కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పారదర్శకత, వేగవంతమైన స్పందనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యం
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు బాధ్యతాయుతంగా పనిచేయాలని సీపీ సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందాలని పిలుపునిచ్చారు. ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించడమే పోలీసింగ్ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
స్టేషన్ పరిశుభ్రతపై సూచనలు
పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు కేసు ఆస్తుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. పెట్రోలింగ్ వాహనాలను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచుకోవాలని, నిరుపయోగంగా ఉన్న పాత సామగ్రిని కమిషనరేట్‌కు తరలించి స్టేషన్ ప్రాంగణాన్ని శుభ్రంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ మాధవి, ఇన్స్పెక్టర్ కరుణాకర్, ఎస్సైలు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

