డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్
Killer Movie| ఆకేరు న్యూస్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైన్స్ ఫిక్షన్, థ్రిల్లింగ్ ట్విస్టులతో రూపొందిన ‘కిల్లర్’ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని దర్శకుడు, నిర్మాత, నటుడు పూర్వాజ్ అన్నారు. సినిమా చూసిన తర్వాత ఇంత వైవిధ్యంగా కథ రాసి తెరకెక్కించవచ్చా? అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని ధీమా వ్యక్తం చేశారు. జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో సినిమా విశేషాలను పూర్వాజ్ వెల్లడించారు.
ఏఐ కథ
‘కిల్లర్’ రిచ్ కంటెంట్‌తో రూపొందిన చిత్రమని పూర్వాజ్ తెలిపారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, యు సర్టిఫికెట్ లభించిందని చెప్పారు. సినిమాలో హింసను అతిగా చూపించకుండా కథకు అవసరమైన రీతిలో తెరకెక్కించినట్లు వివరించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, న్యూరో టెక్నాలజీ నేపథ్యంలో కథ సాగుతుందని తెలిపారు. యంత్రాలపై జరుగుతున్న న్యూరోలింక్ పరిశోధనలను మనుషులపై ప్రయోగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ కథను రూపొందించినట్లు చెప్పారు.
ట్విస్టులే హైలైట్
‘కిల్లర్’లో ప్రీ క్లైమాక్స్ వరకు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే కథనం ఉంటుందని పూర్వాజ్ అన్నారు. ట్రైలర్ చూసినా కథను అంచనా వేయడం కష్టమని, అసలు ట్విస్టులు సినిమాలోనే చూడాలని చెప్పారు.
సెకండాఫ్‌లోని కీలక ట్విస్ట్‌ను ముందుగా గుర్తించిన వారికి రూ.కోటి బహుమతి ఇస్తామని ప్రకటించినట్లు తెలిపారు. ఈ నెల 29న రాత్రి 10 గంటలకు ప్రీమియర్లు ప్రదర్శించనున్నట్లు, ట్విస్ట్‌ను గుర్తించిన వారు రాత్రి 11 గంటలకు సమాధానం పంపించాలని వివరించారు.
రిచ్ విజువల్స్
‘కిల్లర్’ చిత్రానికి సుమారు రూ.5 కోట్ల బడ్జెట్ అయినట్లు గతంలో వెల్లడించానని పూర్వాజ్ తెలిపారు. సినిమాలో విజువల్స్, వీఎఫ్ఎక్స్ నాణ్యత ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పారు. వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కావడం వల్లే సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చిందని వివరించారు.
ఈ చిత్రాన్ని కేవలం 25 రోజుల్లో చిత్రీకరించినట్లు తెలిపారు. ప్రతి సినిమాకు ముందుగానే పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటానని, సన్నివేశాల నిడివితో సహా స్క్రీన్‌ప్లేను ప్రణాళికాబద్ధంగా రూపొందిస్తానని చెప్పారు. ‘కిల్లర్’ స్క్రిప్ట్ 2 గంటల 10 నిమిషాలు ఉండగా, తుది చిత్రం రెండు గంటల నిడివితో సిద్ధమైందని వెల్లడించారు.
మూడు బాధ్యతలు
ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా, నటుడిగా పూర్వాజ్ వ్యవహరిస్తున్నారు. సినిమా నిర్మాణంపై తనకున్న ఆసక్తి, పరిశ్రమలో పొందిన అనుభవం ఈ మూడు బాధ్యతలు నిర్వహించేందుకు ఉపయోగపడ్డాయని చెప్పారు.
గతంలో ‘మాస్టర్ పీస్’, ‘మాటరాని మౌనమిది’, ‘శుక్ర’ వంటి చిత్రాల్లో కొత్తవారికి అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. ‘కిల్లర్’లో తాను కూడా ఓ పాత్రలో నటించానని, తన పాత్రకు ఎక్కువ డైలాగులు ఉంటాయని చెప్పారు.
జ్యోతి కొత్తగా
‘కిల్లర్’లో జ్యోతి పూర్వజ్‌ను ప్రేక్షకులు పూర్తిగా కొత్తగా చూస్తారని పూర్వాజ్ అన్నారు. ఆమె విభిన్న పాత్రల్లో కనిపిస్తారని, ప్రతి పాత్రకు తగ్గట్టుగా మేకోవర్ అయ్యారని తెలిపారు. యాక్షన్ సన్నివేశాలను సింగిల్ టేక్‌లో పూర్తి చేసిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు.
ధశరధకు ఛాన్స్
తనకు ఆరేళ్లుగా దగ్గరగా ఉంటూ సినిమాల కోసం కష్టపడుతున్న లైన్ ప్రొడ్యూసర్ అయినాబత్తిన ధశరధ తనకు సోదరుడితో సమానమని పూర్వాజ్ అన్నారు. ‘కిల్లర్’లో ధశరధ స్నేహితుడి పాత్రలో నటించారని, తన తదుపరి చిత్రంలో పూర్తి స్థాయి పాత్రలో కనిపించనున్నారని వెల్లడించారు. కమెడియన్ రామచంద్రకు ధశరధ రూ.50 వేల ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉందని చెప్పారు.
టికెట్ ధరలపై
భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ ధరలు పెంచడంలో కొంతవరకు సమంజసం ఉన్నప్పటికీ, అన్ని సినిమాలకు ధరలు పెంచడం సరికాదని పూర్వాజ్ అభిప్రాయపడ్డారు. టికెట్ ధరల భారం ప్రేక్షకులపై పడకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ నెల 30న విడుదల
గత చిత్రాల విడుదల సమయంలోనూ పలు ఇబ్బందులు ఎదుర్కొన్నామని పూర్వాజ్ తెలిపారు. ‘శుక్ర’ విడుదల సమయంలో థియేటర్లు మూతపడటంతో ఓటీటీలో మంచి ఆదరణ లభించిందని, ‘మాటరాని మౌనమిది’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పారు.
ఏఐ నేపథ్యం, వైవిధ్యమైన కథ, థ్రిల్లింగ్ ట్విస్టులు, నాణ్యమైన విజువల్స్‌తో ‘కిల్లర్’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఓవర్సీస్లో ఓఎంజీ పిక్చర్స్ పంపిణీ చేస్తోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

