సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
* తాగునీటికి ముందస్తు చర్యలు
* ములుగు కలెక్టర్
ఆకేరు న్యూస్, ములుగు: ఎల్‌నినో నేపథ్యంలో జిల్లాలో తాగునీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. అదే సమయంలో ఉపాధి హామీ పనుల్లో కూలీల భాగస్వామ్యాన్ని పెంచాలని, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉపాధి పనిదినాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మంగళవారం ములుగు కలెక్టరేట్లో పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, ఉపాధి హామీ విభాగాల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో తాగునీటి వసతులు, ఎల్‌నినో సన్నద్ధత, జలసిరి పనులు, ఉపాధి కూలీల హాజరు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.
తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు జిల్లాలోని అన్ని ఆవాసాల్లో తాగునీటి సరఫరా మౌలిక వసతులపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్ సూచించారు. నవంబర్ రెండో వారంలోగా మిషన్ భగీరథ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారుల సమన్వయంతో మండల స్థాయి సమావేశాలు నిర్వహించి, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో రోజువారీ పర్యటనల ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.
చేతిపంపులు, సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ మోటార్లకు అవసరమైన మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని, పైపులైన్ల లీకేజీలను అరికట్టాలని స్పష్టం చేశారు. ఓవర్‌హెడ్ ట్యాంకులను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం శుభ్రం చేయడంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ట్యాంకుల్లోకి కీటకాలు ప్రవేశించకుండా వెంటిలేటర్లకు జాలీలు ఏర్పాటు చేయాలని, మెట్ల పరిస్థితిని పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని సూచించారు.
నీటి నాణ్యతపై పర్యవేక్షణ
తాగునీటి శుద్ధికి బ్లీచింగ్ పౌడర్‌ను క్రమం తప్పకుండా వినియోగించాలని, నీటి సరఫరా చివరి ప్రాంతాల్లో అవశేష క్లోరిన్ స్థాయులను పరీక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. బ్లీచింగ్ పౌడర్ నిల్వలను అందుబాటులో ఉంచడంతోపాటు ప్రతి ఇంటి నల్లా కనెక్షన్ పనిచేసేలా చూడాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు నీటి ట్యాంకర్లను సిద్ధంగా ఉంచాలని, నిర్వహణ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు.
భూగర్భ జలమట్టాలు తగ్గడం, స్థానిక నీటి వనరులు ఎండిపోవడం వల్ల తాగునీటి సమస్య తలెత్తే అవకాశమున్న ఆవాసాలను ముందుగానే గుర్తించాలన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరుల స్థిరత్వం, సరఫరా వ్యవస్థ సామర్థ్యం, నీటి నిల్వ సదుపాయాలు, ప్రత్యామ్నాయ వనరులపై అంచనా వేయాలని సూచించారు. మండల బృందాలు రోజువారీ నివేదికలను సంబంధిత అధికారులకు అందించాలని, వాటిని క్రోడీకరించి జిల్లా స్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ఉపాధి పనుల్లో కూలీల హాజరు పెంచాలి
ఉపాధి హామీ పనుల్లో కూలీల భాగస్వామ్యం పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉపాధి పనిదినాలు కల్పించడం, సంబంధిత వివరాలను సక్రమంగా నమోదు చేయడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గతంలో చేపట్టిన పనుల చెల్లింపుల్లో జాప్యం, సాఫ్ట్‌వేర్‌లో వివరాల నమోదుకు సంబంధించిన సమస్యలను అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
నీటి కుంటలు, ఇందిరా జలప్రభ, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, వర్మీ కంపోస్టు ట్యాంకుల నిర్మాణం వంటి పనులకు అంచనాల సమర్పణ నుంచి అనుమతుల మంజూరు వరకు ప్రతి దశను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు సకాలంలో పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత ఎంపీడీఓలదేనని స్పష్టం చేశారు.
ఫిర్యాదులపై నిర్లక్ష్యం వద్దు
అధికారులు ఉదయం నుంచే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనులు, సిబ్బంది విధులను పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. ఇన్చార్జి ఎంపీడీఓలు తమ మండలాల్లో జరుగుతున్న పనులపై పూర్తి బాధ్యత వహించాలన్నారు.
పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. సంతకాల ఫోర్జరీ వంటి తీవ్రమైన ఆరోపణలను సాధారణ పొరపాట్లుగా పరిగణించరాదని స్పష్టం చేశారు. సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వర్తించేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు, డీఆర్డీఓ రవీందర్, డీపీఓ వెంకయ్య, ఆర్డబ్ల్యూఎస్ అధికారి సునీత, ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఈఈలు, ఏపీఓలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

