ఆసరా పెన్షన్ల కోసం వృద్ధులు
* రెండేళ్లుగా 11 మంది వృద్ధులు, వికలాంగుల అవస్థలు
Station Ghanpur| ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పెన్షన్ పొందేందుకు 11 మంది వృద్ధులు, వికలాంగులు రెండేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామం పేరు తప్పుగా నమోదు కావడంతో ప్రతి నెలా తమ స్వగ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లి పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తమకు ఈ ప్రయాణం భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం రంగరాయిగూడెం గ్రామానికి చెందిన 11 మంది పెన్షన్‌దారుల వివరాలు అదే మండలంలోని తాటికొండ గ్రామానికి చెందినవారిగా నమోదయ్యాయని బాధితులు చెబుతున్నారు. దీంతో ప్రతి నెలా పెన్షన్ తీసుకునేందుకు రంగరాయిగూడెం నుంచి తాటికొండకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. సుమారు 23 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి రావడంతో సమయం, డబ్బు వృథా అవుతున్నాయని వాపోతున్నారు.
ఆటో ఖర్చులూ భారమే..
వయసు మీదపడటంతో పాటు మోకాళ్ల నొప్పులతో నడవలేని పరిస్థితిలో ఉన్నామని బాధితులు చెబుతున్నారు. పెన్షన్ డబ్బుల కోసం ప్రతి నెలా ఆటోలో వెళ్లి రావడానికి సుమారు రూ.200 ఖర్చు చేయాల్సి వస్తోందని తెలిపారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం పొందేందుకు ప్రయాణ ఖర్చులు భరించడం తమకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రంగరాయిగూడెం గ్రామానికి చెందిన మంద వెంకట నర్సయ్య, మంద సమ్మక్క, ఈరగొని ఉప్పలయ్య, బోట్ల ఎల్లమ్మ తదితర 11 మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. తమ పెన్షన్ వివరాలను స్వగ్రామానికి బదిలీ చేయాలని సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని వారు పేర్కొన్నారు.
కలెక్టర్ స్పందించాలి
రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్న తమ సమస్యపై జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు స్పందించాలని బాధితులు కోరుతున్నారు. పెన్షన్ రికార్డుల్లో గ్రామం పేరును సరిచేసి, తమ స్వగ్రామంలోనే పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వృద్ధులు, వికలాంగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

