లోకో పైలట్ మానవత్వం
* సురక్షితంగా దాటిన అడవి దున్నలు
* రైలు నిలిపి వన్యప్రాణులకు దారి
Loco Pilot| ఆకేరు న్యూస్, డెస్క్: వన్యప్రాణుల పట్ల అప్రమత్తత, మానవత్వం ఎంత ముఖ్యమో మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా నాగ్భీద్ సమీపంలో జరిగిన ఘటన మరోసారి చాటిచెప్పింది. రైలు పట్టాలపైకి అకస్మాత్తుగా వచ్చిన అడవి దున్నల (గౌర్) మందను గమనించిన గూడ్స్ రైలు లోకో పైలట్ పప్పు శర్మ వెంటనే రైలును నిలిపివేశారు. దున్నల మంద సురక్షితంగా పట్టాలు దాటిన తర్వాతే రైలును ముందుకు నడిపించారు.
పట్టాలపైకి దున్నల మంద
అక్టోబర్ 25న నాగ్భీద్ ప్రాంతం గుండా గూడ్స్ రైలు వెళ్తుండగా.. అకస్మాత్తుగా అడవి దున్నల మంద పట్టాలపైకి వచ్చినట్లు సమాచారం. పరిస్థితిని గుర్తించిన లోకో పైలట్ పప్పు శర్మ వెంటనే స్పందించి రైలు వేగాన్ని తగ్గించారు. అనంతరం రైలును పూర్తిగా నిలిపివేసి, వన్యప్రాణులు పట్టాలు దాటేందుకు అవకాశం కల్పించారు.
సమయస్ఫూర్తితో రక్షణ
అడవి దున్నల మంద మొత్తం సురక్షితంగా అవతలి వైపునకు వెళ్లిన తర్వాత లోకో పైలట్ రైలును ముందుకు నడిపించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఆయన తన మొబైల్ ఫోన్లో రికార్డు చేసినట్లు సమాచారం. వన్యప్రాణుల పట్ల ఆయన చూపిన శ్రద్ధ, సమయస్ఫూర్తిపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
వన్యప్రాణుల రక్షణకు సందేశం
రైళ్ల ఢీకొనడంతో అడవి జంతువులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వే సిబ్బంది అప్రమత్తత వన్యప్రాణుల రక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. నాగ్భీద్ సమీపంలో జరిగిన ఈ ఘటన వన్యప్రాణుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలనే సందేశాన్ని ఇస్తోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

