ముంబై ఎయిర్పోర్ట్
* 6 గంటలు విమానాలు బంద్
* నవంబర్ 19న రన్‌వేల మూసివేత
ఆకేరు న్యూస్, డెస్క్: విమాన ప్రయాణికులకు ముంబై ఎయిర్పోర్ట్ అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. నవంబర్ 19న ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆరు గంటల పాటు విమాన సర్వీసులు నిలిచిపోనున్నాయి. విమానాశ్రయంలోని రెండు ప్రధాన రన్‌వేలను తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
నిర్వహణ పనుల కోసమే..
వర్షాకాలం ముగియడంతో విమానాశ్రయంలో వార్షిక నిర్వహణ పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా రన్‌వేల ఉపరితల మరమ్మతులు, లైటింగ్ వ్యవస్థల తనిఖీలు, ఇతర సాంకేతిక, భద్రతాపరమైన పనులు చేపట్టనున్నారు. ఈ పనులను పూర్తి చేసేందుకు రెండు రన్‌వేలపై విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు.
విమానాల సమయాల్లో మార్పులు
రన్‌వేల మూసివేత ప్రభావం విమాన సర్వీసులపై పడనుంది. దీంతో పలు విమానయాన సంస్థలు తమ సర్వీసుల షెడ్యూళ్లను మార్చుకునే అవకాశం ఉంది. కొన్ని విమానాలు ముందుగానే బయలుదేరవచ్చు. మరికొన్ని ఆలస్యంగా నడిచే అవకాశం ఉంది. అవసరాన్ని బట్టి కొన్ని సర్వీసులను రీషెడ్యూల్ చేయవచ్చు.
ప్రయాణికులకు సూచనలు
నవంబర్ 19న ముంబై నుంచి ప్రయాణించేవారు, ముంబైకి చేరుకోవాల్సిన ప్రయాణికులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. విమాన టికెట్లలో పేర్కొన్న సమయాలనే నమ్మకుండా, ప్రయాణానికి ముందు ఎయిర్‌లైన్ వెబ్సైట్ లేదా యాప్‌లో తాజా వివరాలను తనిఖీ చేసుకోవాలి. విమానయాన సంస్థల నుంచి వచ్చే SMSలు, ఈ-మెయిల్స్‌ను గమనించాలి. రన్‌వేల నిర్వహణ పనులు పూర్తయిన అనంతరం విమాన కార్యకలాపాలు యథావిధిగా కొనసాగనున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

