జనగణన–2027
* జనవరి 10 నుంచి స్వీయ గణనకు అవకాశం
* ఫిబ్రవరి 28 వరకు ఇంటింటి సర్వే
* మార్చి 1 నుంచి సవరణలు
Census 2027| ఆకేరు న్యూస్, డెస్క్: దేశవ్యాప్తంగా జనగణన–2027 నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 30న నోటిఫికేషన్ జారీ చేసినట్లు వెల్లడైంది. జనాభా వివరాల సేకరణలో భాగంగా ప్రజలకు స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం కూడా కల్పించనున్నారు.
స్వీయ గణనకు అవకాశం
జనగణనలో ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునేందుకు 2027 జనవరి 10 నుంచి 24 వరకు అవకాశం కల్పించనున్నారు. అనంతరం జనవరి 25 నుంచి ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి జనాభా వివరాలను సేకరిస్తారు. ఈ ప్రక్రియ ఫిబ్రవరి 28 వరకు కొనసాగనుంది.
మార్చి 1 కీలకం
2027 మార్చి 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటలను జనగణనకు రిఫరెన్స్ తేదీగా నిర్ణయించారు. సేకరించిన వివరాల్లో మార్పులు, లోపాలను పరిశీలించేందుకు మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు సవరణల ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ సమయంలో అవసరమైన వివరాలను పరిశీలించి నమోదు చేసిన సమాచారాన్ని సరిచేయనున్నారు.
నాలుగు రాష్ట్రాల్లో ముందుగానే
ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జనగణన షెడ్యూల్లో మార్పులు చేశారు. ఈ రాష్ట్రాల్లో 2026 డిసెంబర్ 1 నుంచి 2027 జనవరి 4 వరకు ఇంటింటి జనాభా లెక్కింపు నిర్వహించనున్నారు.
మణిపూర్‌లో వాయిదా
మణిపూర్‌లో తదుపరి ప్రకటన వచ్చే వరకు జనగణన ప్రక్రియను వాయిదా వేశారు. మరోవైపు లద్దాఖ్‌తో పాటు హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌లోని మంచు ప్రభావిత ప్రాంతాల్లో జనాభా లెక్కింపు ఇప్పటికే పూర్తయినట్లు నివేదికలు వెల్లడించాయి.
ఇలా ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులు, ఎన్నికలు, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం జనగణన–2027 ప్రక్రియను వేర్వేరు షెడ్యూళ్లతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

