INDIA Alliance Rally in Delhi
* ఓట్ బచావ్.. దేశ్ బచావో
* 10 లక్షల మందే లక్ష్యం
* రామ్లీలా మైదానంలో భారీ ర్యాలీ
* సీఈసీ రాజీనామా చేయాలి
* ఎన్నికల సంఘానికి విపక్షాల అల్టిమేటం
ఆకేరు న్యూస్, డెస్క్ : దేశంలో ఓటు హక్కును కాపాడాలనే నినాదంతో ఇండియా కూటమి నేడు దేశ రాజధాని ఢిల్లీలో భారీ నిరసన ర్యాలీకి సిద్ధమైంది. ‘ఓట్ బచావ్.. దేశ్ బచావో’ పేరుతో చేపట్టిన ఈ ఆందోళనకు రామ్లీలా మైదానం వేదిక కానుంది. ఈ ర్యాలీకి దేశవ్యాప్తంగా ఇండియా కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నట్లు నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. సుమారు 10 లక్షల మంది హాజరవుతారని అంచనా వేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఓటర్ల జాబితాలో అక్రమాల నివారణ, ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యంగా ఈ నిరసన చేపడుతున్నట్లు కూటమి నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై వారు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
* ఎన్నికల సంఘం ముందు కీలక డిమాండ్లు..
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది. 2023 ఎన్నికల కమిషన్ నియామకాల చట్టాన్ని రద్దు చేయాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కోరుతోంది. సవరణల పేరుతో తొలగించిన అర్హులైన ఓటర్ల పేర్లను తిరిగి జాబితాలో చేర్చాలని కూడా డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహించాలని కూటమి నేతలు కోరుతున్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
* ఢిల్లీపై రాజకీయ ఉత్కంఠ..
రామ్లీలా మైదానంలో జరగనున్న ఈ భారీ ర్యాలీ నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇండియా కూటమి అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీరుపై తమ నిరసన గళాన్ని వినిపించనున్నట్లు సమాచారం. ఈ ర్యాలీ దేశ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. నిర్వాహకులు 10 లక్షల మంది వస్తారని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ఢిల్లీ పోలీసుల అంచనా సుమారు 50 వేల మంది. ర్యాలీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

