Rajasthan
* భార్య సర్పంచ్ అభ్యర్థి
* భర్త మోస్ట్ వాంటెడ్ మద్యం స్మగ్లర్
ఆకేరు న్యూస్, జలోర్: భార్య సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తోంది.. ఆమె విజయం కోసం భర్త కౌంటింగ్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే అతడు ఎవరనేది పోలీసులకు తెలిసింది. ఇంకేముంది.. కౌంటింగ్ గదిలోనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్లో అక్రమ మద్యం రవాణా కేసులో పరారీలో ఉన్న ఈ నిందితుడిపై రూ.20 వేల రివార్డు కూడా ఉంది. రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కౌంటింగ్ గదిలోనే పట్టివేత
జలోర్ జిల్లా రామసీన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తవావ్ గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ ఎన్నికల్లో లలితా సైన్ సర్పంచ్ పదవికి పోటీ చేశారు. ఆమె భర్త కాంతిలాల్ అలియాస్ రోహిత్ కౌంటింగ్ ఏజెంట్‌గా అధికారిక అనుమతితో కౌంటింగ్ గదిలో కూర్చున్నాడు. అయితే అక్కడే గుజరాత్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న మద్యం స్మగ్లర్ ఉన్నట్లు జలోర్ పోలీసుల సైబర్ సెల్, రామసీన్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో రిటర్నింగ్ అధికారి అనుమతితో పోలీసులు కౌంటింగ్ గదిలోకి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఆరు పేర్లతో మోసం
పోలీసుల విచారణలో నిందితుడి గుర్తింపుపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాంతిలాల్ అలియాస్ రోహిత్ తన అసలు గుర్తింపును దాచిపెట్టి వివిధ పేర్లతో చలామణి అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రవీణ్ నారాయణ్, విజయ్ సింగ్ చౌహాన్, ప్రిన్స్ తదితర ఆరు వేర్వేరు పేర్లను ఉపయోగిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
గుజరాత్ పోలీసులకు అప్పగింత
గుజరాత్‌లోని పంచ్‌మహల్ జిల్లా హలోల్ రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన అక్రమ మద్యం రవాణా కేసులో కాంతిలాల్ నిందితుడిగా ఉన్నాడు. అతడి కోసం గుజరాత్ పోలీసుల స్టేట్ మానిటరింగ్ సెల్ (SMC) కొంతకాలంగా గాలిస్తోంది. అతడి ఆచూకీ తెలిపిన వారికి రూ.20 వేల నగదు బహుమతిని కూడా ప్రకటించారు. రాజస్థాన్ పోలీసులు అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసి నిందితుడిని గుజరాత్ ఎస్ఎంసీ బృందానికి అప్పగించారు. ఎన్నికల కౌంటింగ్ సమయంలో జరిగిన ఈ అరెస్ట్ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

