* ఎన్ కన్వెన్షన్ పై ఫిర్యాదుల వెల్లువ
* చెరువును ఆక్రమించి కట్టారంటూ ఆరోపణలు
* హైడ్రాకు ఫిర్యాదు
* రేపటి వరకు నిర్మాణాలు కూల్చొద్దు : తెలంగాణ హైకోర్టు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గండిపేట, మణికొండ, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పలు అక్రమ నిర్మాణాలను ఆ సంస్థ దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈక్రమంలోనే హీరో నటుడు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna)కు చెందిన ఎన్ కన్వెన్షన్(N Convention) సెంటర్‌పై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు చేశారు పలువురు. ఎఫ్టీఎల్లో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేయాలని హైడ్రా కమిషనర్‌కు జనం కోసం అనే సంస్థ ఫిర్యాదు చేసింది. తమ్మిడి చెరువుపై ‘దాదాపు 3 ఎకరాల 30 గుంటల చెరువును చెరబట్టి హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించారు. దీనిపై మా ‘జనం కోసం’(Janam Kosam) అనేక ఫిర్యాదులు చేసింది. ఇప్పుడు తాజాగా సర్వే నెంబర్ 36, 37, 38/పి. 11/2, 11/36, 68/పి, 41/పి లకు చెందిన 29 ఎకరాల 24 గుంటల చెరువు, ప్రభుత్వ భూమి ఎఫ్టిఎల్, బఫర్ జోన్లపై ఉన్న కబ్జాలను తొలగించి.. ‘తమ్మిడి చెరువు’ను పునరుద్ధరించాలని అనేక ఫిర్యాదులు చేశాం.’ అని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రతినిధులు హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదును అందజేశారు.
హైడ్రాకు ఉన్న లీగల్ స్టేటస్ ఏంటి?
జన్వాడ ఫామ్కేసు విచారణను చేపట్టిన హైకోర్టు(High court) హైడ్రాకు ఉన్న లీగల్ స్టేటస్ ఏంటని ప్రశ్నించింది. రేపటి వరకు ఏ నిర్మాణాలనూ కూల్చవద్దని ఆదేశించింది. 20 ఏళ్ల తర్వాత ఎఫ్టీఎల్ అంటున్నారు ఏంటని ప్రశ్నించింది. హైడ్రా లీగల్ స్టేటస్ వివరాలను హైకోర్టుకు వివరిస్తామని ప్రభుత్వ లాయర్ తెలిపారు.
—————————-