IndiGo Flight
* ఎమర్జెన్సీ డోర్‌ను తాకడంతో గాల్లోనే అలారం
* క్యూరియాసిటీతో లివర్ కవర్‌ను తాకిన ప్రయాణికుడు
IndiGo Flight| ఆకేరు న్యూస్, డెస్క్: ఇండిగో విమానంలో ప్రయాణికుడి వింత చర్య కలకలం రేపింది. విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌కు సంబంధించిన లివర్ కవర్‌ను ఓ ప్రయాణికుడు తాకడంతో అలారం మోగింది. దీంతో విమానంలోని ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై విమాన సిబ్బంది ఫిర్యాదు చేయడంతో పోలీసులు సదరు ప్రయాణికుడిపై కేసు నమోదు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నవంబర్ 2వ తేదీ అర్ధరాత్రి ఢిల్లీ నుంచి పుణెకు బయలుదేరిన ఇండిగో ఫ్లైట్ 6E6884లో ఈ ఘటన చోటుచేసుకుంది. గౌరవ్ సత్యేంద్ర రౌతేలా (33) అనే ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ సమీపంలోని సీటులో కూర్చున్నాడు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎమర్జెన్సీ డోర్ మెకానిజంతో అనుసంధానమైన లివర్ కవర్‌ను తాకినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో విమానంలో హెచ్చరిక అలారం మోగింది.
ఆసక్తితోనే తాకానన్న ప్రయాణికుడు
విచారణలో భాగంగా పోలీసుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. కేవలం ఆసక్తితోనే ఆ కవర్‌ను తాకానని, అది ఎమర్జెన్సీ ఎగ్జిట్‌కు సంబంధించినదని తనకు తెలియదని గౌరవ్ తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. అయితే విమానంలో అత్యవసర ద్వారాలకు సంబంధించిన పరికరాలను అనుమతి లేకుండా తాకడం భద్రతాపరమైన సమస్యలకు దారితీస్తుందని పోలీసులు పేర్కొన్నారు.
BNS, ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ కింద కేసు
విమాన సిబ్బంది ఫిర్యాదు మేరకు గౌరవ్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 125తో పాటు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ నిబంధనల కింద కేసు నమోదు చేశారు. అలాగే భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 35(3) కింద నోటీసు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
కాగా, ఈ విమానం నవంబర్ 2వ తేదీ అర్ధరాత్రి 12.45 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి నవంబర్ 3వ తేదీ తెల్లవారుజామున సుమారు 2 గంటలకు పుణెకు చేరుకున్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

