Free Marriage Registration Camp in Kerala
* 7 వేల మందితో కేరళ ఆలయం రద్దీ..
ఆకేరు న్యూస్, డెస్క్ : కేరళలోని కోజికోడ్ జిల్లా, కారంతూర్ నగరంలోని ప్రసిద్ధ హరహర మహాదేవ ఆలయంలో నిర్వహించిన ఉచిత వివాహ రిజిస్ట్రేషన్ క్యాంపునకు ఊహించని విధంగా భారీ స్పందన లభించింది. జీవిత భాగస్వామిని కోరుతూ మరియు సరైన సంబంధాలు దొరకక ఇబ్బంది పడుతున్న యువతీయువకుల కోసం ఆలయ కమిటీ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
* పెళ్లిళ్ల కోసం ఎగబడ్డ జనం..
సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసారమైన ఈ ప్రకటన చూసి కేవలం 1,000 నుండి 1,500 మంది మాత్రమే వస్తారని నిర్వాహకులు ప్రాథమికంగా అంచనా వేసి, ఆ మేరకు దరఖాస్తు ఫారాలను సిద్ధం చేశారు. అయితే, ఊహలన్నింటినీ తలకిందులు చేస్తూ కేరళలోని వివిధ ప్రాంతాల నుంచి ఏకంగా 7,000 మందికి పైగా జనం పోటెత్తారు. కన్నూర్, వాయనాడ్, పాలక్కాడ్ వంటి సుదూర జిల్లాల నుంచి కూడా ఉదయం పూటనే ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
* కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్..
నిర్వాహకులు ముందుగా సిద్ధం చేసుకున్న 1,500 దరఖాస్తు ఫారాలు క్షణాల వ్యవధిలోనే అయిపోవడంతో, హడావుడిగా జిరాక్స్ కాపీలను, ఆ తర్వాత ప్రింటింగ్ ప్రెస్ నుంచి అదనపు కాపీలను తెప్పించాల్సి వచ్చింది. ఆలయ ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ క్యూ లైన్ జాతీయ రహదారిపై ఉన్న రెండు బస్ స్టాప్ల వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర సాగింది. విపరీతమైన జనసందోహం వల్ల రోడ్లపై తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది.
* 80శాతం పురుషులే..
ఈ క్యాంపునకు హాజరైన వారిలో దాదాపు 80 శాతం మంది పురుషులూ ఉండగా, వారిలోనూ ముప్పై సంవత్సరాలు దాటినవారే ఎక్కువగా ఉన్నారు. అలాగే దరఖాస్తు చేసుకున్న మహిళల్లో చాలామంది రెండో వివాహం కోసం ఎదురుచూస్తున్నవారే కావడం గమనార్హం. ఈ అపూర్వ స్పందన దృష్ట్యా, నవంబర్ 22 తర్వాత నుంచి ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఈ ప్రత్యేక క్యాంపును నిరంతరం కొనసాగించాలని ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

