విమానాశ్రయంలో ప్రయాణికుల నిరసన
* 8 గంటల ఆలస్యం తర్వాత విమానం రద్దు
* ఏసీ పనిచేయక ప్రయాణికుల అవస్థలు
* విసుగుతో విమానాశ్రయంలో బైఠాయింపు
ఆకేరు న్యూస్, డెస్క్: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తీరుపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబై నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గొరఖ్‌పూర్ వెళ్లాల్సిన స్పైస్‌జెట్ SG 553 విమానం సుమారు 8 గంటల పాటు ఆలస్యమై చివరకు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. విమానంలో ఏసీ పనిచేయకపోవడం, గంటల తరబడి నిరీక్షించినా సరైన సమాచారం అందకపోవడంతో ఆందోళనకు దిగారు.
విమానంలో ఏసీ పనిచేయక ఇబ్బందులు
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గొరఖ్‌పూర్‌కు వెళ్లాల్సిన SG 553 విమానంలో ప్రయాణికులు బోర్డింగ్ పూర్తి చేసుకున్నారు. అయితే విమానంలో సాంకేతిక సమస్య కారణంగా ఏసీ పనిచేయలేదు. దీంతో విమానంలో ఉక్కపోతతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యను పరిష్కరించేందుకు సాంకేతిక నిపుణులు దాదాపు రెండు గంటల పాటు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
8 గంటల తర్వాత విమానం రద్దు
విమాన ప్రయాణం ఆలస్యమవుతున్నప్పటికీ ప్రయాణికులకు సరైన సమాచారం అందలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో గొరఖ్‌పూర్ విమానాశ్రయంలో రాత్రి 9 గంటల తర్వాత విమానాల రాకపోకలకు అనుమతి లేకపోవడంతో విమానాన్ని రద్దు చేసినట్లు సమాచారం. దీంతో గంటల తరబడి ఎదురుచూసిన ప్రయాణికులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
విమానాశ్రయంలో ప్రయాణికుల నిరసన
విమానం రద్దు కావడంతో సహనం కోల్పోయిన ప్రయాణికులు విమానాశ్రయ ప్రాంగణంలో బైఠాయించి నిరసన తెలిపారు. కొందరు నేలపై పడుకుని తమ అసహనాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో, సరైన సమాచారం అందించడంలో విమానయాన సంస్థ విఫలమైందంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.
మరుసటి రోజు ప్రత్యేక విమానం
ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మరుసటి రోజు గొరఖ్‌పూర్‌కు వెళ్లేందుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసినట్లు ఎయిర్‌లైన్స్ వర్గాలు తెలిపాయి. అయితే గంటల తరబడి ఎదురుచూసిన ప్రయాణికులకు ఎదురైన అసౌకర్యంపై విమానయాన సంస్థ తీరుపై విమర్శలు కొనసాగుతున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

