TGSRTC New Rules Bus Doors Close Passenger Safety
* డోర్లు మూశాకే బస్సు కదలాలి..
* డోర్లు లేని బస్సులకు వెంటనే ఏర్పాటు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) బస్సుల భద్రతపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బస్సుల డోర్లు పూర్తిగా మూసిన తర్వాతే వాహనాలను ముందుకు కదిలించాలని ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.
డోర్లు లేని బస్సులకు వెంటనే వాటిని ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతి నేపథ్యంలో ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఈ నిబంధనలను అమలు చేయాలని యాజమాన్యం సూచించింది.
* అన్ని రకాల బస్సులకు నిబంధనలు
సిటీ బస్సులు, పల్లె వెలుగు బస్సులు సహా ప్రయాణికులను తరలించే అన్ని సర్వీసుల్లో డోర్లు సక్రమంగా పనిచేసేలా చూడాలని ఆదేశించింది. డోర్లు పూర్తిగా మూసిన తర్వాతే బస్సును నడపాలని డ్రైవర్లకు సూచించింది. ప్రస్తుతం డోర్లు లేని బస్సులను గుర్తించి, యుద్ధప్రాతిపదికన వాటికి డోర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్రంలోని డిపో మేనేజర్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
* కండక్టర్ ప్రవళిక మృతి నేపథ్యంలో నిర్ణయం
మణుగూరు డిపోకు చెందిన మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక విధుల్లో ఉండగా బస్సులో చోటుచేసుకున్న వివాదం సందర్భంగా బయటకు తోసివేయబడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఈ విషాద ఘటన తర్వాత బస్సుల్లో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా డోర్ల నిర్వహణ, వాటి వినియోగంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

