Kamalapur
* కమలాపూర్‌లో నిరుద్యోగ యువతకు అవకాశం
* దరఖాస్తుల ఆహ్వానం
ఆకేరు న్యూస్, కమలాపూర్: మండలంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ గుండె బాబు తెలిపారు. గౌతమ్ బుద్ధ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్, DDU-GKY సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణతో పాటు హాస్టల్ వసతి కల్పించనున్నారు. శిక్షణ పూర్తయిన అనంతరం ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించనున్నట్లు ఎంపీడీఓ వెల్లడించారు.
అర్హతలు ఇవే..
కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై, 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన కమలాపూర్ మండల పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నవంబర్ 6న ఎంపిక ప్రక్రియ
ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 6వ తేదీ ఉదయం 10 గంటలకు కమలాపూర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించే ఎంపిక ప్రక్రియకు హాజరుకావాలని సూచించారు.
అభ్యర్థులు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలను వెంట తీసుకురావాలని తెలిపారు. అర్హులైన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ గుండె బాబు కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

