CM Revanth Reddy Kodangal Tour
* రూ.9 వేల కోట్లతో అభివృద్ధి పనులు
* మూడు రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన
* కొడంగల్‌లో మెగా రైతు మేళా..
ఆకేరు న్యూస్, డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవంబర్ 7, 8, 9 తేదీల్లో కొడంగల్ నియోజకవర్గంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పోను ప్రారంభించడంతో పాటు నియోజకవర్గంలో భారీ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. మొత్తం రూ.9,053.48 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 13 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన పలు ప్రభుత్వ భవనాలను ప్రారంభించనున్నారు.
నవంబర్ 7న మెగా రైతు మేళా
ముఖ్యమంత్రి పర్యటన నవంబర్ 7న ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పోను ప్రారంభిస్తారు. అనంతరం రైతు మేళాలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో నిర్వహించే ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సమస్యలు, కొత్త సాగు విధానాలు, ఆధునిక సాంకేతికతపై వారితో చర్చిస్తారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో సమావేశమై పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. తర్వాత కొడంగల్‌కు చేరుకుంటారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
నవంబర్ 8న ఉదయం మరోసారి హకీంపేటకు చేరుకుని స్వయం సహాయక సంఘాల మహిళలతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. అనంతరం వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.81 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఎకోపామ్ పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారు. హకీంపేటలో నాట్కో సంస్థ సీఎస్ఆర్ నిధులతో రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలను ప్రారంభిస్తారు. రూ.2.35 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. బొంరాస్‌పేటలో రూ.4.79 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని, రూ.3 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. కొడంగల్‌లో రూ.3.80 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయ భవనాలను ప్రారంభించనున్నారు.
దుద్యాలలో రూ.3 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్‌తో పాటు రూ.12 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత మండల కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. కోస్గి మండలం నాచారం గ్రామంలో రూ.5,060 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రేడియల్ రోడ్డు-2కు శంకుస్థాపన చేస్తారు. ఔటర్ రింగ్ రోడ్డుపై కొత్తవాల్‌గూడ నుంచి నాచారం మీదుగా జాతీయ రహదారి 167N వరకు ఈ రహదారిని నిర్మించనున్నారు. అలాగే కోస్గిలో రూ.6 కోట్లతో నిర్మించిన సైన్స్ మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. దౌల్తాబాద్ మండలం బాలంపేటలో రూ.2.35 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, దౌల్తాబాద్‌లో రూ.4.79 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభిస్తారు. అనంతరం కొడంగల్‌లోని తన నివాసానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.
రూ.9,053 కోట్లతో 13 అభివృద్ధి కార్యక్రమాలు
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి మొత్తం రూ.9,053.48 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 13 పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల్లో ప్రధానంగా కొత్తవాల్‌గూడ నుంచి నాచారం వరకు నిర్మించే రేడియల్ రోడ్డు-2 కోసం రూ.5,060 కోట్లు కేటాయించారు. ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద 223 కొత్త, అసంపూర్తి బీటీ రహదారుల నిర్మాణానికి రూ.1,410 కోట్లు ప్రతిపాదించారు. ఎంఎన్‌కేఎల్‌ఐఎస్ రెండో దశ పనులకు రూ.2,100 కోట్లు కేటాయించనున్నారు. విద్యారంగంలో రూ.118.80 కోట్లతో 10 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు, రూ.123 కోట్లతో కొడంగల్‌లో వ్యవసాయ కళాశాల నిర్మాణం చేపట్టనున్నారు.
రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు కొడంగల్, కోస్గి, మద్దూరులో ఆధునిక బస్టాండ్ల నిర్మాణానికి రూ.41.83 కోట్లు కేటాయించారు. మద్దూరులో రూ.20 కోట్లతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, మరో రూ.20 కోట్లతో సమీకృత డివిజనల్ కార్యాలయ సముదాయం నిర్మించనున్నారు. రహదారుల అభివృద్ధికి రూ.59.30 కోట్లు వెచ్చించనున్నారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రాల అభివృద్ధిలో భాగంగా తిమ్మారెడ్డిపల్లిలో గురులోక మసంద్ ప్రభు మందిరానికి రూ.4.45 కోట్లు, కొడంగల్‌లో నిరంజన్ మఠం అభివృద్ధికి రూ.5.10 కోట్లు కేటాయించారు. పారిశ్రామిక, పర్యాటక రంగాల అభివృద్ధి కోసం హకీంపేట ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.10 కోట్లతో పర్యాటక హోటల్ నిర్మాణం, రూ.81 కోట్లతో ఎకోపామ్ పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నారు.
రూ.46.08 కోట్లతో పూర్తయిన భవనాల ప్రారంభం
నియోజకవర్గంలో రూ.46.08 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తిచేసుకున్న పలు ప్రభుత్వ భవనాలను కూడా ఈ పర్యటనలో ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. వీటిలో దుద్యాల సమీకృత మండల కార్యాలయ భవనం, కోస్గి సైన్స్ మ్యూజియం, హకీంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నాయి. అదేవిధంగా దుద్యాల, బొంరాస్‌పేట పోలీస్ స్టేషన్లు, బొంరాస్‌పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల, కొడంగల్ పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయం, దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కూడా ప్రారంభించనున్నారు.
నవంబర్ 9న రైతు బహిరంగ సభ
మూడు రోజుల పర్యటనలో చివరి రోజైన నవంబర్ 9న ముఖ్యమంత్రి కొడంగల్ నివాసం నుంచి హకీంపేటకు చేరుకుంటారు. అక్కడ నిర్వహించనున్న భారీ రైతు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభకు రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల నుంచి సుమారు 50 వేల మంది రైతులను సమీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్యం, రవాణా, మౌలిక వసతుల రంగాలకు సంబంధించిన పలు కార్యక్రమాలు చేపట్టనుండటంతో కొడంగల్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

