WhatsApp SIM Binding
* ఫోన్లో రిజిస్టర్డ్ సిమ్ లేకపోతే వాట్సాప్, టెలిగ్రామ్ పనిచేయవా?
* జనవరి 1 నుంచి కొత్త రూల్స్!
WhatsApp SIM Binding| ఆకేరు న్యూస్, డెస్క్: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొస్తోంది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి మెసేజింగ్ యాప్‌ల వినియోగానికి సిమ్ బైండింగ్ నిబంధనలను తప్పనిసరి చేయనుంది. అంటే.. ఏ మొబైల్ నంబర్‌తో అయితే యాప్‌లో ఖాతా నమోదు చేసుకున్నారో, ఆ నంబర్‌కు సంబంధించిన యాక్టివ్ సిమ్ కార్డు యాప్ పనిచేస్తున్న ఫోన్లో ఉండాలి. ఈ నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లను అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) ఈ నిర్ణయం తీసుకుంది. యాప్‌లకు అవసరమైన మార్పులు చేసుకునేందుకు 2026 డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చింది.
* ఏమిటి ఈ సిమ్ బైండింగ్ రూల్?
ప్రస్తుతం వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్‌లలో మొబైల్ నంబర్ ద్వారా ఓటీపీ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత సిమ్ కార్డును ఫోన్ నుంచి తొలగించినా యాప్‌లు పనిచేస్తూనే ఉంటాయి. వైఫై కనెక్షన్ ఉంటే చాలు.. మెసేజ్‌లు పంపుకోవచ్చు, కాల్స్ చేసుకోవచ్చు.
అయితే కొత్త నిబంధనల ప్రకారం ఈ విధానంలో మార్పు రానుంది. వినియోగదారుడు ఏ నంబర్‌తో యాప్‌లో రిజిస్టర్ చేసుకున్నారో, ఆ నంబర్‌కు సంబంధించిన యాక్టివ్ సిమ్ అదే ఫోన్లో ఉండాలి. సిమ్‌ను తొలగించినా, డీయాక్టివేట్ చేసినా లేదా మరో ఫోన్లోకి మార్చినా యాప్ సేవలకు అంతరాయం కలగవచ్చు. తిరిగి సంబంధిత సిమ్‌ను ఫోన్లో అమర్చిన తర్వాతే సేవలు కొనసాగుతాయి.
కేంద్ర టెలికమ్యూనికేషన్స్ విభాగం జారీ చేసిన ఆదేశాలు వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్‌చాట్, అరట్టై, షేర్‌చాట్, జోష్, జియోచాట్ వంటి యాప్‌లను ప్రస్తావించాయి. భారతీయ మొబైల్ నంబర్లను వినియోగదారుల గుర్తింపు కోసం ఉపయోగించే కమ్యూనికేషన్ యాప్‌లకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.
* ఎవరిపై ఎక్కువ ప్రభావం ఉంటుంది?
సిమ్ కార్డు లేకుండా కేవలం వైఫై సహాయంతో వాట్సాప్ ఉపయోగించేవారు ఈ మార్పును గమనించాలి. ఒకే వాట్సాప్ ఖాతాను ప్రధాన ఫోన్‌తో పాటు ఇతర పరికరాల్లో ఉపయోగించేవారికి కూడా కొత్త నిబంధనల ప్రభావం ఉండవచ్చు. ముఖ్యంగా ఒక ఫోన్లో సిమ్ ఉంచి, మరో ఫోన్లో అదే ఖాతాను ఉపయోగించే వారు జాగ్రత్తగా ఉండాలి. విదేశాలకు వెళ్లే సమయంలో భారతీయ సిమ్‌ను పూర్తిగా తొలగించి స్థానిక సిమ్ మాత్రమే ఉపయోగించే వారిపైనా ఈ నిబంధనలు ప్రభావం చూపవచ్చు.
సిమ్ బైండింగ్ నిబంధనలతో పాటు వాట్సాప్ వెబ్, ఇతర వెబ్ ఆధారిత సేవల వినియోగంపై కూడా మార్పులు ప్రతిపాదించారు. మొదట ప్రతి ఆరు గంటలకు ఆటోమేటిక్‌గా లాగౌట్ చేసి, మళ్లీ క్యూఆర్ కోడ్ ద్వారా లింక్ చేయాలనే నిబంధన తెరపైకి వచ్చింది. అయితే తర్వాత ప్రభుత్వం వెబ్ సెషన్ల విషయంలో రిస్క్ ఆధారిత లాగౌట్ విధానాన్ని స్పష్టం చేసింది. అనుమానాస్పద కార్యకలాపాలు లేదా భద్రతా ముప్పు ఉన్నప్పుడు సెషన్లను నిలిపివేసే విధానం అమలు చేయనున్నారు. ప్రతి ఆరు గంటలకు తప్పనిసరిగా లాగౌట్ అవుతుందని ప్రస్తుతం చెప్పలేం.
* సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యం
గతంలో కొందరు సైబర్ నేరగాళ్లు భారతీయ మొబైల్ నంబర్లతో వాట్సాప్, టెలిగ్రామ్ ఖాతాలను యాక్టివేట్ చేసుకుని, ఆ తర్వాత సిమ్ కార్డులను ఫోన్ నుంచి తొలగించి ఇతర ప్రాంతాల నుంచి వైఫై ద్వారా ఖాతాలను ఉపయోగిస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. దీంతో భారతీయ నంబర్లతో నమోదైన ఖాతాలను సిమ్ కార్డుతో నిరంతరం అనుసంధానించాలనే నిర్ణయం తీసుకుంది. ఈ చర్యతో నకిలీ ఖాతాలు, ఫిషింగ్, డిజిటల్ అరెస్ట్ మోసాలు, ఇతర సైబర్ నేరాలను అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
* ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది?
సిమ్ బైండింగ్ నిబంధనలను అమలు చేసేందుకు తొలుత 2026 మార్చి వరకు గడువు ఇచ్చారు. అయితే సాంకేతిక మార్పులు చేసుకోవడానికి మరింత సమయం కావాలని యాప్ సంస్థలు కోరడంతో కేంద్రం గడువును పొడిగించింది. తాజా సమాచారం ప్రకారం 2026 డిసెంబర్ 31 వరకు యాప్ సంస్థలు నిబంధనలకు అనుగుణంగా వ్యవస్థలను సిద్ధం చేసుకోవాలి. 2027 జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
కాబట్టి సిమ్ కార్డు లేకుండా వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ఉపయోగించే వారు తమ ఖాతాకు అనుసంధానమైన నంబర్ సిమ్‌ను సంబంధిత ఫోన్లో యాక్టివ్‌గా ఉంచుకోవడం మంచిది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

