Warangal CP Swetha
* విద్యార్థుల నైపుణ్యానికి ప్రోత్సాహం..
* వస్తువులు కొనుగోలు చేసిన వరంగల్ సీపీ శ్వేత
* ప్రత్యేక విద్యార్థులతో దీపావళి వేడుకలు..
ఆకేరు న్యూస్, వరంగల్ : ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు వారి సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ముందడుగు వేశారు. విద్యార్థులు స్వయంగా తయారు చేసిన హ్యాండ్‌మేడ్ వస్తువులను కొనుగోలు చేసి వారిని అభినందించారు.
* హ్యాండ్‌మేడ్ వస్తువుల కొనుగోలు..
హనుమకొండ బాలసముద్రంలోని మల్లికాంబ మనోవికాస కేంద్రానికి చెందిన ప్రత్యేక విద్యార్థులు, కేంద్రం వ్యవస్థాపకురాలు రామలీల, ఈసీ సభ్యుడు కల్యాణ్‌తో కలిసి హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్‌ను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వివిధ రకాల హ్యాండ్‌మేడ్ వస్తువులను కొనుగోలు చేశారు. వారి నైపుణ్యాలను, సృజనాత్మకతను ప్రశంసించారు. ఇలాంటి ప్రోత్సాహం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని పేర్కొన్నారు.
* విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించిన సీపీ
అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి వారి ప్రతిభను అభినందించారు. ప్రత్యేక విద్యార్థులు తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేయడం, వారిని ప్రోత్సహించడం ఆనందంగా ఉందని సీపీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) రాయల ప్రభాకర్ రావు, ఏఆర్ అదనపు డీసీపీ సురేష్, ఆర్ఐ (అడ్మిన్) సర్జన్ రాజ్, వెల్ఫేర్ ఆర్ఐ సతీష్, ఆర్ఐ శ్రీధర్, మల్లికాంబ మనోవికాస కేంద్రం సిబ్బంది, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్యేక విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభించేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

