మంత్రి సీతక్క
* మంత్రి సీతక్క
Seethakka| ఆకేరు న్యూస్, ములుగు: జిల్లాలోని అటవీ, ప్రకృతి సంపదకు ఎలాంటి నష్టం కలగకుండా ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆదివాసీ గిరిజనుల జీవనోపాధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు.
జయేష్ రంజన్‌తో ప్రత్యేక సమీక్ష
అటవీ, పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన జయేష్ రంజన్ శనివారం తొలిసారిగా ములుగు జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో మంత్రి సీతక్కతో సమావేశమయ్యారు. జిల్లాలో అటవీ పరిరక్షణ, ఎకో టూరిజం, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి, గిరిజనుల జీవనోపాధి వంటి అంశాలపై చర్చించారు.
గిరిజనులకు ఉపాధి అవకాశాలు
ములుగు జిల్లాలోని అడవులు, కొండలు, వాగులు, జలపాతాలు పర్యాటకులను ఆకర్షించే సామర్థ్యం కలిగి ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రకృతికి హాని కలగకుండా ఎకో టూరిజం కేంద్రాలను అభివృద్ధి చేయాలని సూచించారు. స్థానిక గిరిజనులను పర్యాటక రంగంలో భాగస్వాములను చేస్తూ అటవీ ఉత్పత్తులు, హస్తకళలు, సంప్రదాయ ఆహార ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలని అన్నారు.
మౌలిక వసతుల అనుమతులు వేగవంతం చేయాలి
ఏజెన్సీ గ్రామాల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల వంటి కనీస మౌలిక వసతుల కల్పనకు అటవీ అనుమతుల్లో జాప్యం లేకుండా చూడాలని సీతక్క కోరారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ పరిధిలోని అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని జయేష్ రంజన్‌కు సూచించారు.
అటవీ పరిరక్షణ, ప్రజల అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ములుగు జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎఫ్ఓతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

