Free Laptops Scheme CM Vijay
* కాలేజీ విద్యార్థులకు వెట్రి ల్యాప్టాప్ స్కీమ్ ప్రారంభం
* విజయ్ సర్కార్ గుడ్ న్యూస్
* రూ.2 వేల కోట్ల పథకానికి గ్రీన్ సిగ్నల్
ఆకేరు న్యూస్, డెస్క్ : తమిళనాడులోని కళాశాల విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ.2,000 కోట్ల భారీ బడ్జెట్ను కేటాయించింది. ‘వెట్రి ల్యాప్టాప్ స్కీమ్’ పేరుతో ఈ పథకాన్ని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీ విద్యార్థులకు అవకాశం
2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది. డిగ్రీ, డిప్లొమా మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించనున్నారు. కళలు, సైన్స్, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ, మెడిసిన్, వెటర్నరీ సైన్స్, ఫిషరీస్, అగ్రికల్చర్, లా తదితర కోర్సుల విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. అంతేకాకుండా 2025–26 విద్యా సంవత్సరంలో గత ల్యాప్టాప్ పథకం ద్వారా ప్రయోజనం పొందలేకపోయిన ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లోని మూడో, నాలుగో సంవత్సరం ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు కూడా ఈసారి అవకాశం కల్పించారు.
ఇంజినీరింగ్ విద్యార్థులకు కోర్ i5 ల్యాప్టాప్లు
విద్యార్థుల కోర్సులు, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ల్యాప్టాప్ల నాణ్యత విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ముఖ్యంగా ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటెల్ కోర్ i5 లేదా దానికి సమానమైన అత్యాధునిక ప్రాసెసర్ కలిగిన ల్యాప్టాప్లను అందించనున్నారు. మిగిలిన విద్యార్థులకు కూడా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పరికరాలను అందించేందుకు చర్యలు చేపట్టారు. ఈ పథకం అమలును పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి మార్గదర్శక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ల్యాప్టాప్ల కొనుగోలు బాధ్యతను తమిళనాడు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ (ELCOT)కు అప్పగించారు. నాణ్యతా ప్రమాణాలను పరిశీలించిన తర్వాతే ల్యాప్టాప్లను సేకరించేలా ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
డిజిటల్ విద్యకు ప్రోత్సాహం
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు ల్యాప్టాప్లు ఎంతో అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఆన్లైన్ తరగతులు, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉద్యోగాల కోసం సన్నద్ధం కావడంలో ఇవి ఉపయోగపడతాయని పేర్కొంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గించడంతో పాటు డిజిటల్ విద్యకు సమాన అవకాశాలు కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. రూ.2,000 కోట్లతో చేపట్టనున్న ఈ వెట్రి ల్యాప్టాప్ పథకం తమిళనాడు విద్యార్థులకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

