Tribal Students
* విద్యార్థులకు పురుగుల ఆహారం
* ఆహార ధాన్యాల్లో పురుగులు
* ప్రిన్సిపల్‌తో పాటు ఇద్దరు వార్డెన్లపై వేటు
ఆకేరు న్యూస్, ఛత్తీస్‌గఢ్: గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, భోజన సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వ పాఠశాలలో నిర్లక్ష్యం రాజ్యమేలింది. విద్యార్థులకు అందించే ఆహార ధాన్యాల్లో పురుగులు, గడువు ముగిసిన ఆహార పదార్థాల నిల్వ, అపరిశుభ్రంగా మారిన మరుగుదొడ్లు.. ఇలా ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చిన సమస్యలు అధికార యంత్రాంగాన్ని కదిలించాయి. ఓ మహిళా ఉపాధ్యాయురాలి ఆత్మహత్యాయత్నం, వేధింపుల ఆరోపణలతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది. చివరకు విచారణ కమిటీ నివేదిక ఆధారంగా ప్రిన్సిపల్‌తో పాటు ఇద్దరు హాస్టల్ వార్డెన్లపై అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఆత్మహత్యాయత్నంతో వెలుగులోకి..
ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్ జిల్లాలో ఉన్న శ్యాంపూర్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ కంప్యూటర్ సైన్స్ పీజీటీగా పనిచేస్తున్న ప్రియాంక పరిహార్ అక్టోబర్ 10న ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. అనంతరం ఆమె జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందారు. పాఠశాల యాజమాన్యం తనను మానసికంగా వేధిస్తోందని, విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ఆమె ఆరోపించారు.
తనిఖీల్లో విస్తుపోయే విషయాలు..
ఉపాధ్యాయురాలి ఆరోపణలతో పాటు పాఠశాలలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, గిరిజన సంఘాల ప్రతినిధులు అక్టోబర్ 31న నిరసన చేపట్టారు. దీంతో జిల్లా కలెక్టర్ నుపుర్ రాశి పన్నా విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.
నవంబర్ 3న బాలుర, బాలికల వసతి గృహాలను తనిఖీ చేసిన కమిటీ పలు లోపాలను గుర్తించింది. ముఖ్యంగా బాలికల హాస్టల్లో నిల్వ ఉంచిన బియ్యం, ఇతర రేషన్ సరుకుల్లో పురుగులు కనిపించాయి. గడువు ముగిసిన ఆహార పదార్థాలను కూడా నిల్వ ఉంచినట్లు గుర్తించారు.
మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటంతో పాటు కొన్ని తలుపులు విరిగిపోయాయి. కుళాయిలు సరిగా పనిచేయక నీరు వృథా అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. బాలికల హాస్టల్లో ఏర్పాటు చేసిన శానిటరీ ప్యాడ్ల దహన యంత్రం పనిచేయడం లేదని తేలింది. బాలుర వసతి గృహంలోనూ ఆహార ధాన్యాల నిల్వ, ఇతర మౌలిక సదుపాయాల్లో లోపాలు బయటపడ్డాయి.
కొన్ని వస్తువులు, ఆధారాలను మరింత పరిశీలించాల్సిన అవసరం ఉందని భావించిన అధికారులు నాయబ్ తహసీల్దార్ సమక్షంలో నాలుగు గదులకు తాళాలు వేసి సీల్ చేశారు.
ప్రిన్సిపల్, ఇద్దరు వార్డెన్లపై వేటు
విచారణ కమిటీ నివేదిక ఆధారంగా పాఠశాల ప్రిన్సిపల్ చంద్రకిరణ్ తివారీని బాధ్యతల నుంచి తప్పించారు. బాలుర, బాలికల వసతి గృహాల పర్యవేక్షకులను కూడా విధుల నుంచి తొలగించారు. పాఠశాల నిర్వహణకు ప్రభుత్వం కొత్త ప్రిన్సిపల్‌ను నియమించింది.
విద్యార్థులకు మెరుగైన వసతి, భోజనం, పారిశుధ్య సౌకర్యాలు కల్పించడంతో పాటు నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని కమిటీ సూచించింది. ఇందుకోసం తల్లిదండ్రులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.
పోలీస్ స్టేషన్ వద్ద గిరిజన సంఘాల ఆందోళన
ఈ వ్యవహారం నవంబర్ 6న మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. తల్లిదండ్రులు, గిరిజన సంఘాల ప్రతినిధులు తమ ఫిర్యాదులను సమర్పించేందుకు ఏజాక్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఛత్తీస్‌గఢ్ సర్వ ఆదివాసీ సమాజ్ జిల్లా అధ్యక్షుడు పంకు రామ్ నేతమ్ పాఠశాలలో తనిఖీలకు ముందే కొన్ని ఆధారాలను తొలగించారని ఆరోపించారు. గిరిజన సమాజంపై అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు కూడా ఆందోళనకు కారణమయ్యాయి.
ఈ క్రమంలో వంద మందికి పైగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోకి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ పంకజ్ చంద్ర అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
తమ సభ్యులను, మహిళా ప్రతినిధిని పోలీస్ స్టేషన్ ప్రాంగణం నుంచి బయటకు నెట్టారని గిరిజన సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. అయితే ఎస్పీ పంకజ్ చంద్ర భిన్నమైన వివరణ ఇచ్చారు. పెద్ద సంఖ్యలో వచ్చిన ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోకి ప్రవేశించి నష్టం కలిగించారని, అక్కడ నివసిస్తున్న పోలీసు సిబ్బంది కుటుంబాలు భయాందోళనకు గురయ్యాయని తెలిపారు. జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని, బాధితులు అధికారికంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
విద్యార్థులకు న్యాయం జరిగేనా?
ఒకవైపు ఉపాధ్యాయురాలి వేధింపుల ఆరోపణలు, మరోవైపు విద్యార్థులకు అందుతున్న ఆహారం, వసతి సదుపాయాల్లో లోపాలు.. వెరసి ఏకలవ్య పాఠశాల నిర్వహణపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రిన్సిపల్, ఇద్దరు వార్డెన్లపై పరిపాలనా చర్యలు తీసుకున్నప్పటికీ, విద్యార్థులకు నాణ్యమైన భోజనం, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే అసలైన పరిష్కారం. ఉపాధ్యాయురాలి ఫిర్యాదులు, పాఠశాలలో జరిగిన నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ పూర్తయితేనే ఈ వ్యవహారంలో పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

