Patnam Narender Reddy Arrest
* అంత్యక్రియలకు వెళ్తుండగా పోలీసుల అడ్డంకి
* పరిగి వద్ద హైడ్రామా..
ఆకేరు న్యూస్, వికారాబాద్ : కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోస్గిలో మృతి చెందిన పార్టీ కార్యకర్త అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఆయనను వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలోని బహార్పేట్ చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు.
కోస్గిలో మృతి చెందిన కార్యకర్త కుటుంబ సభ్యులను పరామర్శించి, అంత్యక్రియల్లో పాల్గొనేందుకు నరేందర్ రెడ్డి వెళ్తున్నట్లు సమాచారం. అయితే పరిగి వద్దకు చేరుకోగానే పోలీసులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ప్రాంతానికి వస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగానే ఆయనను అదుపులోకి తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపినట్లు సమాచారం.
ఈ క్రమంలో పోలీసుల తీరుపై పట్నం నరేందర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను తన నివాసానికి వెళ్తున్నానని, అంత్యక్రియలకు హాజరుకావడానికి వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పోలీసులకు, నరేందర్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
* పోలీసు వాహనాన్ని చుట్టుముట్టిన కార్యకర్తలు
మరోవైపు మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసు వాహనాన్ని చుట్టుముట్టి నరేందర్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో బహార్పేట్ చౌరస్తా వద్ద కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు భారీగా మోహరించారు. కార్యకర్తలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ పరిణామంతో పరిగి ప్రాంతంలో రాజకీయంగా చర్చ మొదలైంది. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుతో కొడంగల్ నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

