Madhya Pradesh Fire Accident
* పసికందు సహా 6 గురు మృతి
* గోడ కూల్చి మృతదేహాలు తీసిన పోలీసులు
ఆకేరు న్యూస్, డెస్క్: మధ్యప్రదేశ్లోని కట్నీ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బర్హీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక బాణసంచా దుకాణంలో ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవ దహనమయ్యారు. ప్రమాద తీవ్రతకు మంటలు క్షణాల్లోనే మూడంతస్తుల భవనానికి వ్యాపించడంతో లోపల ఉన్నవారు బయటకు రాలేకపోయారు.
ఏమి జరిగిందంటే..
స్థానిక సమాచారం ప్రకారం.. బర్హీ ప్రాంతంలోని ఓ మూడంతస్తుల భవనం కింద భాగంలో బాణసంచా దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. ఉన్నట్టుండి షాపులో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దుకాణంలో పెద్ద ఎత్తున పటాకులు, పేలుడు పదార్థాలు ఉండటంతో మంటలు వేగంగా పైఅంతస్తులకు వ్యాపించాయి. దట్టమైన పొగ, నిప్పురవ్వలు భవనాన్ని ముంచెత్తడంతో పైఅంతస్తుల్లో ఉన్న కుటుంబ సభ్యులు చిక్కుకుపోయారు.
రెండు నెలల పాప సహా ఆరుగురి మృతి
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనం లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ తీవ్రమైన పొగ, మంటల వల్ల సాధ్యపడలేదు. చివరకు జేసీబీ (JCB) యంత్రం సహాయంతో భవనం గోడను కూల్చివేసి లోపల ఉన్నవారిని బయటకు తీశారు. అయితే, అప్పటికే ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో రెండు నెలల పసికందు కూడా ఉండటం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే, నివాస గృహాలు ఉన్న మూడంతస్తుల భవనంలో బాణసంచా నిల్వ ఉంచడానికి నిబంధనల ప్రకారం అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశంపైనా అధికారులు దృష్టి సారించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

