ధోల్పూర్ జిల్లాలో తీవ్ర విషాదం
* బావిలో దూకిన కుటుంబం
* తండ్రీకొడుకులు మృతి
Family Tragedy| ఆకేరు న్యూస్, డెస్క్: రాజస్థాన్‌లోని ధోల్పూర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న భూ వివాదంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బావిలో దూకారు. ఈ ఘటనలో తండ్రి, కుమారుడు ప్రాణాలు కోల్పోగా.. పోలీసులు సకాలంలో స్పందించడంతో తల్లి ప్రాణాలతో బయటపడింది. దీపావళి రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
బావిలోకి ముగ్గురు
ధోల్పూర్లోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పట్పరా మొహల్లాలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. స్థానిక నివాసి పప్పు అలియాస్ సురేష్, ఆయన భార్య సరోజ్ (55), కుమారుడు ఇంద్రేష్ ఇంటి సమీపంలోని బావిలోకి దూకారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
తల్లిని కాపాడిన పోలీసులు
సమాచారం అందుకున్న యాక్టింగ్ సీఓ ధర్మసింగ్ మీణా, కొత్వాలి ఎస్సై రామకిషన్ యాదవ్ పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో బావిలో నిచ్చెనలు, తాళ్లను ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టారు. ఓ పోలీసు సిబ్బంది బావిలోకి దిగి సరోజ్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
తండ్రీకొడుకులు మృతి
మరోవైపు బావిలో ఉన్న సురేష్, ఆయన కుమారుడు ఇంద్రేష్‌ను బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఇద్దరినీ వెలికితీసి జిల్లా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వారి మృతదేహాలను ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.
భూ వివాదమే కారణమా?
ఈ ఘటనపై మృతుడి పెద్ద కుమారుడు రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పూర్వీకుల ఖాతేదారీ భూమి, దేవాలయ భూమికి సంబంధించి కొంతకాలంగా వివాదం కొనసాగుతోందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. భూమిని కబ్జా చేసేందుకు కొందరు ఒత్తిడి తెస్తున్నారని, కోర్టు కేసులు, వేధింపులతో కుటుంబం తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందని ఆరోపించారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భూ వివాదం, కుటుంబం ఎదుర్కొన్నట్లు చెబుతున్న ఒత్తిళ్లపై విచారణ కొనసాగుతోంది. ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో పట్పరా మొహల్లాలో విషాదం నెలకొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

